మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. 47 ఎకరాల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని గిరిజనులు ఆరోపించారు.
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. 4 సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు ఆయన తొమ్మిది మంది అనుచరులపై శామీర్ పేట పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. సీఐ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టీ (లంబాడీ)లవారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కుట్ర పూర,ఇతంగా కాజేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేశామని చెప్పారు.
మాజీ మంత్రి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అతని అనుచరుడు, బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్) జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్, శామీర్ పేట మండల వ్యవసాయ సహకార సేవ సంఘం వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, శివుడు స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై ఐపీసీ 420 చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
రాత్రి 11 గంటలకు రిజిస్ట్రేషన్
మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల18 గుంటల భూమి మా పెద్దల నుంచి తమకు వారసత్వంగా వచ్చిందని బాధితుడు కేతావత్ భిక్షపతి నాయక్ చెప్పారు. ఈ భూమి తనతోపాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులపైనా ఉన్నదని చెప్పారు. దీనిపై కన్నేసిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహరామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిని మా ఇంటికి పంపి మాయమాటలతో నమ్మించి కుట్ర పూరితంగా రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని చెప్పారు.
తమ ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఇచ్చి రాత్రి 11 గంటల సమయంలో శామీర్ పేట తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మంత్రికి అండగా ఉండి తమతో రాత్రి వేళ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తహసీల్తార్ వాణిపైనా కేసులు నమోదు చేయాలని భిక్షపతి నాయక్ డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల మా భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతని పార్టీ అనుచరులు 9 మందిపై సమగ్ర విచారణ చేపట్టాలని, తమ భూమిని తమకు ఇప్పంచాలని విజ్ఞప్తి చేశారు.