రైతును అవమానించిన మాల్ మూసివేత

రైతును అవమానించిన మాల్ మూసివేత

బెంగళూరు: ధోతీ కట్టుకున్నాడని ఓ రైతును అవమానించిన బెంగళూరులోని జీటీ వరల్డ్ మాల్ సెక్యూరిటీ గార్డుతోపాటు మాల్ యజమానిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 126(2) (నిర్బంధం) కింద కేసు నమోదైంది. రైతుకు అవమానంపై సీరియస్ అయిన కర్నాటక సర్కారు.. ఆ మాల్ నువారం పాటు మూసివేయాలని కూడా ఆదేశించింది. మంగళవారం  జీటీ మాల్ లోని మల్టీప్లెక్స్ లో కొడుకుతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హవేరికి చెందిన ఫకీరప్ప అనే రైతును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 

పంచె కట్టుకున్నందుకు మాల్ లోకి అనుమతించలేమని చెప్పారు. తమ దగ్గర సినిమా టికెట్స్ ఉన్నాయని.. మాల్ లోకి పంపాలని తండ్రి, కొడుకు కోరినా సెక్యూరిటీ గార్డు వదల్లేదు. సెక్యూరిటీ ప్రవర్తనను ఫకీరప్ప కొడుకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో మాల్ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. మాల్ ఎదుట రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. రైతుకు, ఆయన కొడుక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

 మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది రైతులతో నిరసనకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో రైతుకు మాల్ సెక్యూరిటీ సిబ్బంది క్షమాపణలు చెప్పారు. వీడియో వైరల్ కావడంతో కర్నాటక ప్రభుత్వం కూడా స్పందించింది. రైతును అవమానించినందుకు జీటీ వరల్డ్ మాల్ ను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది.