భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలోని తన భర్త ఇంటి ముందు సౌగంధిక అనే యువతి ఆందోళనకు దిగింది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని ఆమె భర్త నవజీవన్రాజు పుట్టింటికి పంపాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది. సౌగంధిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఎన్ఎస్టీ రోడ్డుకు చెందిన సౌగంధికతో ఇందిరా నగర్ కు చెందిన నవజీవన్ రాజుకు గత ఏడాది డిసెంబర్లో రూ.3 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. రాజుకు అంతకుముందే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకొని మోసం చేశాడని పేరెంట్స్ ఆరోపించారు. సెల్ ఫోన్ లో అసభ్యకర వీడియోలు, ఫొటోలను చూపించి ఇలా కాపురం చేస్తేనే ఉండాలని ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపారు. మహిళా పీఎస్ లో ఫిర్యాదు చేసిన న్యాయం చేయలేదని వాపోయారు. ఘటన స్థలానికి టూ టౌన్ పోలీసులు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేస్తే నవజీవన్ రాజును పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పడంతో సౌగంధిక ఆందోళన విరమించింది.
ట్రిపుల్ఐటీ స్టూడెంట్స్ కు ఆర్థికసాయం
ఖమ్మం టౌన్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న 18 మంది నిరుపేద విద్యార్థులకు రిక్కాబ్ బజార్ గవర్నమెంట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వైవీ, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయకుమారి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం ఇవ్వడమే కాకుండా, ఒక్కో స్టూడెంట్ ను ఒక్కొక్కరు దత్తత తీసుకోవడం అభినందనీయమని అన్నారు. చావా రమేశ్‌బాబు, కె.పురుషోత్తంరావు, ఎం ప్రసాదరావు, ఎ వెంకట్రావు, టి.రాఘవయ్య, శ్రీమన్నారాయణ, డాక్టర్ చావా సత్యప్రసాద్, చిరుమామిళ్ల రంగారావు ఆర్థికసాయం అందించారు.
ఆత్మ కమిటీ చైర్మన్ గా కోసూరి శ్రీను
వైరా, వెలుగు: వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గా కోసూరి శ్రీనివాసరావును నియమించినట్లు ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రకటించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయని చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రత్నం, వైస్ చైర్మన్ సీతారాములు, జడ్పీటీసీ కనకదుర్గ, పుల్లయ్య, కౌన్సిలర్ దేవి కుమారి పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్‌పై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్(పా) ఎస్ చంద్రశేఖర్‌పై కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టులతో పాటు సమస్యలపై శుక్రవారం డైరెక్టర్ చంద్రశేఖర్‌ను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గోళ్ల రమేశ్తదితరులు కలిశారు. సమస్యలు తెలుపుతుండగా, డైరెక్టర్ తమను అవమానించేలా మాట్లాడినట్లు లంబాడా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ధరావత్ రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. గిరిజన సంఘాల నాయకులతో పాటు గిరిజనులను అవమానించేలా మాట్లాడిన డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాజ్‌కుమార్ జాదవ్ హెచ్చరించారు.
కోటమైసమ్మ జాతరలో జనసందోహం
మండలంలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర నాలుగో రోజూ భక్తజన సందోహంతో మారింది. భక్తులు కోటమైసమ్మ తల్లిని దర్శించుకొనేందుకు బారులు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాగారం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
-
కుమ్రం భీం విగ్రహావిష్కరణ
దమ్మపేట, వెలుగు: గిరిజన పోరాటయోధుడు కుమ్రం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుతో కలిసి మారప్పగూడెం గ్రామంలో భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటం చేశారని కొనియాడారు. మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జారే ఆదినారాయణ, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, ఎంపీటీసీ చలపతి రావు, ప్రసాద్, పండు, ప్రవీణ్, నర్సి పాల్గొన్నారు
ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
పాల్వంచ, వెలుగు: పట్టణంలోని బొల్లోరుగూడెంలోని సరస్వతీ విద్యాపీఠం సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మూడు రాష్ట్రాల కో ఆర్డినేటర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఇండియన్ వ్యాల్యూస్ సిస్టం ఇన్ మోడ్రన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. డీఈవో సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు సరస్వతీ విద్యాపీఠం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
రైల్లోంచి జారిపడి..
మధిర, వెలుగు: గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి యువకుడు చనిపోయాడు. శనివారం మధిర రైల్వే బ్రిడ్జి(వైరా ఏరుపై) ఈ ఘటన జరిగింది. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గంగానగర్‌కు చెందిన ముషక అశ్వంత్(26)గా గుర్తించారు. మృతుడు విజయవాడ నుంచి మంచిర్యాల వెళ్లేందుకు ట్రైన్లో ప్రయాణిస్తుండగా, ప్రమాదవశాత్తు మధిర సమీపంలో జారి పడి చనిపోయినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.