- పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు
- సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొఘల్ పురా పోలీసులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది. ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా సుధా టాకీస్ వద్ద వేదికపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడే సమయంలో కొంత మంది బాలికలు వేదిక పైకి వచ్చారు. వారిని అమిత్‌షా దగ్గరకు తీసుకున్నారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు ఉంది. ఇద్దరు చిన్నారుల చేతిలో ‘అబ్కీ బార్ 400 పార్’ అని రాసి ఉంది.
చిన్నారులతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ దీనిపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ మేరకు మొఘల్ పురా పోలీసులు విచారణ చేపట్టి సెక్షన్188 ఐపీసీ కింద అమిత్‌షా పై కేసు నమోదు చేశారు. ఏ1 గా యమాన్ సింగ్, ఏ2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, ఏ3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏ4 గా రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, ఏ5 గా రాజాసింగ్ తో పాటు పలువురి పై కేసు బుక్ చేశారు.