న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ తన క్రెడిట్ కార్డ్ వల్ల దారుణంగా మోసపోయారు. క్రెడిట్ లిమిట్‌ను పెంచుతామంటూ ఆయనకు కాల్ వచ్చింది. అయితే తదనంతరం డాక్టర్ ఖాతా నుంచి రూ.2 లక్షలు పోయాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం, స్కామ్‌ల కేసులు పెరుగుతున్నందున ఆర్బీఐ కస్టమర్ల డబ్బులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మీరు ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, ఆర్బీఐ మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సమస్యల వంటి సమాచార అంతరాలు లేదా బ్యాంకింగ్ సమస్యల వల్ల మీరు మోసానికి గురైతే ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. మీరు లేదా మీ బ్యాంక్ బాధ్యత వహించని థర్డ్‌పార్టీ తప్పిదం కారణంగా మీ డబ్బు చోరీ అయితే వాటిని తిరిగి పొందవచ్చు. అయితే మోసం జరిగిన మూడు రోజుల్లోపు బ్యాంకుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. మోసాన్ని 4 నుంచి 7 రోజులలోపు తెలియజేసినప్పటికీ, మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉండవచ్చు.
అదే రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లాలి...
ఈ విషయమై ఢిల్లీ పోలీసు సైబర్ ఎక్స్పర్ట్ కిస్లే చౌదరి మాట్లాడుతూ ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకులు రీఫండ్‌లను వాయిదా వేస్తుంటాయని అన్నారు. రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ మోసం బారినపడితే, అదే రోజు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవడం ఉత్తమం.
అది సాధ్యం కాకపోతే, ఫిర్యాదును ఫైల్ చేసినట్లు నిర్ధారించుకోండి. పోలీసు రసీదుతో మరుసటి రోజున మీ బ్యాంకుకు వెళ్లండి. బ్యాంకులో దరఖాస్తుతోపాటు పోలీసు రసీదు ఇవ్వండి. మూడవ దశలో రెండు డాక్యుమెంట్‌ల సాఫ్ట్ కాపీలను ఆర్బీఐ ఈ–మెయిల్ ఐడీ crpc@rbi.org.inకి పంపాలి. అలాగే సీసీలో మీ బ్యాంక్, పర్సనల్ఈ–మెయిల్ఐడీని చేర్చాలి. లేదా 1930 కి కాల్ చేయాలి. ఇదంతా 3 రోజుల్లోపు జరగాలి. వారం తరువాత ఫిర్యాదు చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. బిట్‌కాయిన్, క్రిప్టో, ఆన్‌లైన్ గేమ్‌లల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందడం దాదాపు అసాధ్యం.