భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. పాముతో కాటేయించి చంపించిన భార్య

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోఈ నెల 10న రియల్టర్‌‌‌‌‌‌‌‌ హత్య కేసులో ట్విస్ట్‌‌‌‌‌‌‌‌ వెలుగుచూసింది. మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించిన భార్య లలిత మరో ఐదుగురితో కలిసి నిద్రపోతున్న భర్తను దిండుతో ఊపిరి ఆడకుండా  చేయడమే కాకుండా పాముతో కాటు వేయించి చంపించింది. ఈ కేసులో శుక్రవారం గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

పెద్దపల్లి డీసీపీ వైభవ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ కథనం ప్రకారం..గోదావరిఖని మార్కండేయకాలనీలో ఉండే కొచ్చర ప్రవీణ్‌‌‌‌‌‌‌‌(42)‌‌‌‌కు భార్య లలిత, ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నాడు. గతంలో పలు దినపత్రికల్లోని అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విభాగంలో పనిచేసిన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టి అభివృద్ధి చెందాడు. ఈ క్రమంలోనే ఇండ్లు నిర్మించి ఇస్తూ బిల్డర్‌‌‌‌‌‌‌‌గా కూడా ఎదిగాడు.

అయితే, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాలలో ఎక్కువగా ఉండడం వల్ల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి రోజూ గొడవలు జరుగుతుండేవి. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో లలిత తన భర్త ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ను హత్య చేయడానికి వారి వద్దే సెంట్రింగ్‌‌‌‌‌‌‌‌ పనిచేసే రామగుండానికి చెందిన మచ్చ సురేశ్‌‌‌‌‌‌‌‌ సహకారాన్ని కోరింది. అతడు అంగీకరించడంతో పనిచేసినందుకు సురేశ్‌‌‌‌‌‌‌‌కు ఒక ప్లాట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి ఒప్పుకుంది. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ను ఊపిరాడకుండా చేసి చంపాలని, ఒకవేళ అతను చనిపోకపోతే పాముతో కాటేయించి చంపి సహజ మరణంగా అందరినీ నమ్మించాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌ వేసుకున్నారు. ఇందులో భాగంగా సురేశ్‌‌‌‌‌‌‌‌, అతని స్నేహితుడైన ఇందారపు సతీశ్‌‌‌‌‌‌‌‌, మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, భీమ గణేశ్‌‌‌‌‌‌‌‌, ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పాములు పట్టే నన్నపరాజు చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ కలిసి ఈ నెల10న అర్ధరాత్రి పడుకున్న ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ను దిండు, చెద్దరతో ఊపిరాడకుండా చేసి పాముతో కాటు వేయించి చంపారు. తర్వాత పరారయ్యారు.

తెల్లవారిన తర్వాత లలిత తన భర్త ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ను నిద్రలేపుతున్నట్టుగా నటిస్తూ అతని మిత్రుడికి, ఇంటి చుట్టుపక్కల వారికి లేవట్లేదని చెప్పి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించింది. అప్పటికే డాక్టర్లు ప్రవీణ్​చనిపోయాడని నిర్ధారించారు. తర్వాత మృతదేహాన్ని ఇంటివద్ద ఫ్రీజర్​లో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అనుమానం వచ్చిన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ తల్లి మరియమ్మ గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు అన్ని కోణాల్లో విచారణ జరపడంతో తన భర్తను తానే హత్య చేశానని లలిత అంగీకరించింది.

ఈ కేసులో ఇన్వాల్వ్‌‌‌‌‌‌‌‌ అయి నేరం అంగీకరించిన లలితతో పాటు పరారీలో ఉన్న మరో ఐదుగురిని శక్రవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నేరానికి ఉపయోగించిన మూడు మోటర్‌‌‌‌‌‌‌‌ సైకిళ్ళు, ఆరు మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, 34 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వైభవ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు ప్రమోద్‌‌‌‌‌‌‌‌ రావు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.