సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రిపై కేసు

సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రిపై కేసు

జీడిమెట్ల, వెలుగు : సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిపై కేసు నమోదైంది. మహిళను బ్రేన్​ సమస్యతో అడ్మిట్​చేస్తే  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేసిన రోజే మహిళ చనిపోగా, వెంటిలేటర్​పై ఉంచి తమని మభ్యపెట్టారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట​మండలం సుతార్​పల్లికి చెందిన చిన్నవల్లోల్ల లక్ష్మి (48) అనారోగ్య సమస్యతో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్​ చేయాలని నిర్ణయించారు. 

ఇందుకోసం రూ.25 వేలు తీసుకున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఆపరేష్​ ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశారు. ఆపై10వ తేదీన కుటుంబ సభ్యులను పిలిచి, 9న ఆమెకు బ్రేన్​స్ట్రోక్​వచ్చిందని రూ.78 వేలు చెల్లించి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 9న బ్రేన్​స్ట్రోక్​వస్తే ఇప్పుడెందుకు చెప్తున్నారని బాధిత కుటుంబసభ్యులు నిలదీయడంతో కొంత వాగ్వాదం జరిగింది. అనంతరం రిపోర్టులు ఇవ్వకుండా కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని లక్ష్మిని తీసుకెళ్లడానికి అనుమతించారు. దీంతో అంబులెన్స్​లో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో లక్ష్మి మృతి చెందింది. 

దీంతో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు. తాజాగా లక్ష్మి కుమార్తె అశ్విని సూరారం పోలీసులకు ఈ నెల 18న ఫిర్యాదు చేసింది. వైద్యులు ఆపరేషన్​చేసిన రోజే తన తల్లి చనిపోగా వెంటిలేటర్​పై ఉంచి తమని మభ్యపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల గాల్​బ్లాడర్​లో సమస్యతో వెళ్లిన మహిళకు సరైన వైద్యం అందించకుండా చంపేశారని రోగి బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.