ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ కోదాడ క్రాస్ రోడ్లోని రమేశ్ దాబాలో రెండు రోజుల కింద జరిగిన గొడవ, ఖమ్మం ఆసుపత్రి అవరణలో జరిగిన దాడి ఘటనలో 18 మందిపై కేసు నమోదు చేసినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. సోమవారం కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రమేశ్ దాబాలో బిల్లు డబ్బులు చెల్లించే క్రమంలో దాబా నిర్వహకులతో ఖమ్మంలోని రేవతి సెంటర్కు చెందిన యువకులతో వివాదం మొదలైంది.
అక్కడే ఉన్న తెల్దారుపల్లికి చెందిన వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో గాయపడిన తెల్దారుపల్లికి చెందిన ఇనుప రాంబాబును జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని పరామర్శించేందుకు అదే రోజు తెల్దారుపల్లికి చెందిన నెల్లూరి వినోద్, మహేశ్, కాళీచరణ్, సాయి, గోవర్ధన్, ఉదయ్ ప్రభుత్వాసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తుండగా వారిపై రేవతి సెంటర్, నెహ్రూనగర్, ముస్తఫానగర్, ధంసలాపురం, కొత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన యువకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
ఈ ఘటనలో నెల్లూరి వినోద్, మహేశ్, కాళీచరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాడులను అడ్డుకోబోయిన ఖమ్మం రూరల్ ఎస్సై సురేశ్ పై దాడి చేశారు. దీనిపై నెల్లురి వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొల్లి ఉదయ్ (28), కుమ్మరి విజేత (30), పగిడి కతుల ప్రశాంత్ (28), పేర్నాగి ఉపేందర్ (27), డంగ్రోత్ హుస్సియన్ (28), కొల్లి అభినయ్ (26), చిలపాక వినయ్ (28), మంద సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు అలియాస్ బాబు (28), బుడిగ అశోక్ (21), గుజులూరి వినోద్ కుమార్ అలియాస్ వివేక్ (23), లింగపోగు దీలీప్ (26) ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.
Also Read : పోలీసులు ఫస్ట్ సీఎం రేవంత్పై కేసు పెట్టాలి.. లేకపోతే కోర్టుకెళ్తం: కవిత