
ఘట్ కేసర్, వెలుగు: ప్లాటును కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ సత్యసాయి నగర్ లోని సర్వే నంబర్ 44లో ప్లాటు నంబర్ 241ని బోడుప్పల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్ కాలనీ కి చెందిన బండ శ్యామల 2013లో కొనుగోలు చేశారు. 100 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాటు చుట్టూ కడీలు పాతి హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల పక్క ప్లాటు యజమాని సురేష్ ఇంటి నిర్మాణం చేస్తూ శ్యామలకు చెందిన ప్లాటులోని 60 గజాల స్థలాన్ని కబ్జా చేశాడు. ఆమె వెళ్లి అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించి దుర్భాషలాడినట్లు బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేసింది. తమ స్థలాన్ని ఇవ్వాలని లేనిచో మొత్తం స్థలాన్ని కొనుగోలు చేయాలని కోరినా నిరాకరించి భయపెట్టినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొనగా.. సురేష్ పై కేసు నమోదు చేసినట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు.