
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీపై మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తనను మోసం చేసినట్లు అఘోరీపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ 9.8 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటన నుంచి మహిళా అఘోరీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అఘోరీ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రోడ్లపై నగ్నంగా తిరగడం.. ప్రశ్నించిన వారిపై భూతులతో విరుచుకుపడటం.. ఆలయాల్లోకి వెళ్లి నానా హంగామా సృష్టించడం.. ఇలా మహిళా అఘోరీ అరాచకాలు అన్ని ఇన్నీ కావు.
కొన్ని రోజుల పాటు మీడియాలో మహిళా అఘోరీపై చర్చలే జరిగాయంటే అఘోరీ ఎలాంటి వీరంగం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలనైనే ఏపీ మంగళగిరికి చెందిన ఓ యువతిని ఏకంగా మహిళా అఘోరీ తీసుకెళ్లడం సెన్సేషన్‌గా మారింది. తమ కూతురిని అఘోరీ మభ్య పెట్టిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాను ఇష్టంగానే అఘోరీతో వెళ్లినట్లు యువతి వీడియో రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ పోలీసులు మహిళా అఘోరీ చెర నుంచి యువతిని విడిపించారు.