హుజూర్ నగర్ , వెలుగు : హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలతో పాలకవీడు మండలం భవానిపురంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎండీ బంగారు రాజు, ఏజీఎం నాగమల్లేశ్వరరావుపై పీఎస్‌లో కేసు నమోదైంది. బాధితుల తరఫు అడ్వకేట్ కాల్వ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. పాలకీడు మండలం రావి పహాడ్ గ్రామానికి చెందిన కల్లేటి వెంకయ్యకు 1975లో అప్పటి ప్రభుత్వం రావిపాడు రెవెన్యూలోని సర్వే నెంబర్లు 31/7, 31 / 18లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. అప్పటినుంచి అతను, అతని కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పక్కనే ఉన్న దక్కన్ సిమెంట్ యాజమాన్యం కంపెనీ విస్తరణ కోసం ఈ భూమిని ఎలాగైనా తీసుకోవాలని ప్లాన్ వేసింది. ఇందులోభాగంగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి స్వాధీన పరుస్తున్నట్లుగా వేరే వ్యక్తి చేత దరఖాస్తు చేయించి.. దక్కన్ ఫ్యాక్టరీకి కేటాయిస్తున్నట్లుగా రికార్డులు తయారు చేశారు. తర్వాత కల్లేటి వెంకయ్య వారసుల కబ్జాలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు దక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నించింది.
దీంతో కల్లేటి వెంకయ్య కొడుకు, కూతుళ్లు కల్లేటి పెద్ద సైదులు, కల్లేటి చిన్న సైదులు, గడగంట్ల సైదమ్మ, నీలం గురవమ్మ, గడగంట్ల లక్ష్మి పాలకీడు పీఎస్‌లో ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. కానీ వాళ్లు పట్టించుకోకపోవడంతో సూర్యాపేట ఎస్పీ, కోదాడ డీఎస్పీ, హుజూర్ నగర్ సీఐలకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదును పంపారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో అడ్వకేట్ కాల్వ శ్రీనివాసరావు ద్వారా కోర్టును ఆశ్రయించి కంప్లైంట్ దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు దక్కన్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని పాలకీడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.