న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిశీపై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై సీఎం అతిశీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతిశీతో పాటు ఆమె అనుచరులపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా.. సోమవారం (ఫిబ్రవరి 3) రాత్రి పది వాహనాల్లో దాదాపు అరవై మంది మద్దతుదారులతో సీఎం అతిశీ ఫతే సింగ్ మార్గ్‌కు చేరుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతిశీతో పాటు ఆమె అనుచరులపైన కేసులు నమోదు అయ్యాయి.
మంగళవారం (ఫిబ్రవరి 4) తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో గోవింద్‌పురి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌ను అడ్డుకుని దాడి చేసినందుకు అధికార ఆప్‌కు చెందిన ఇద్దరు సభ్యులు అష్మిత్, సాగర్ మెహతాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై సీఎం అతిశీ స్పందించారు. ‘‘కల్కాజీ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి, ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. వారిపై మాత్రం ఈసీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రమేష్ బిధూరిపై ఫిర్యాదు చేసిన తనపై మాత్రం కేసు నమోదు చేశారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అతిశీ.
Also Read :- తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాయిదా
ఈసీ పైన ఆమె మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికల పక్షపాతంగా వ్యవహరిస్తోందని.. బీజేపీ అభ్యర్థులపై ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈసీ చాలా అద్భుతంగా పని చేస్తోందని సీఎం అతిశీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మరోవైపు.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారన్న ఆప్ నేతల ఫిర్యాదుతో కల్కాజీ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి కుమారుడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న వేళ.. ఆప్, బీజేపీ నేతల పోటాపోటీ ఫిర్యాదులతో ఢిల్లీ పాలిటిక్స్ వేడేక్కాయి.