- ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టులో ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్, రిత్విక్ ప్రాజెక్ట్స్ మధ్య విభేదాలు
హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్ నటుడు తొట్టెంపూడి వేణుపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. వేణుతో పాటు మరికొంత మంది పేర్లను ఇందులో చేర్చారు. వేణుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుటుంబానికి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాయి. 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి.
జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైన కొద్దిరోజులకే విభేదాలు రావడంతో వేణుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన వేణు,హేమలత, పాతూరి ప్రవీణ్, భాస్కర్ రావు, శ్రీవాణి కలిసి సబ్ కాంట్రాక్టు తీసుకున్నారు. వారు కాంట్రాక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నందున తమకు భారీ నష్టం వాటిల్లిందని రిత్విక్ సంస్థ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మే నెలలో వేణుతోపాటు సంస్థ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.