
సోషల్ మీడియా సెలెబ్రిటీలు, యూట్యూబర్లతో మొదలైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుల పరంపర ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ అనన్య నాగళ్ళ చేరగా.. ఇప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫన్ 88 బెట్టింగ్ యాప్ కి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోషన్స్ చేశారని.. ఈ ప్రమోషన్స్ వల్ల చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు రామారావు.
అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్, గోపీచంద్ లు గెస్ట్లుగా అటెండ్ అయ్యారు.. ఈ ఎపిసోడ్ లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని. ఫన్ 88 యాప్ లో బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ షో చూసి ఫన్ 88 బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నానని.. ఈ యాప్ లో బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని వాపోతున్నాడు బాధితుడు. మొదటిసారి రూ. 10వేలు పెట్టగా 18వేలు వచ్చాయని.. అలా వస్తూ, పోతూ రూ. 3లక్షల దాకా సంపాదించానని.. అప్పులు కట్టేశానని చెబుతున్నాడు బాధితుడు.
డబ్బులు వచ్చాయి కదా అని మళ్ళీ ఆడానని.. ఆ తర్వాత డబ్బులు పోవడం మొదలయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. ఊర్లో, బంధువులతో.. అప్పులు చేశానని.. మొత్తం 83 లక్షలు పోగొట్టుకున్నానని తెలిపాడు బాధితుడు. అప్పుల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోయి వచ్చానని తెలిపాడు బాధితుడు.