
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుకగా పేరు గాంచిన మహా కుంభమేళాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మహా కుంభమేళాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తోన్న 140 అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు మహాకుంభ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ వెల్లడించారు.
మహా కుంభ్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాముల్లో భక్తులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను షేర్ చేసిన 140 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనిత కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతుల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక, 2025, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహా కుంభ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహా శివరాత్రి పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నారు. 2025, ఫిబ్రవరి 23వ తేదీ వరకు మహా కుంభమేళాలో 62 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని పేర్కొన్నారు. కాగా, 2025, జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్ 2025, ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. మహా శివరాత్రితో మహా కుంభ్ వేడుక ముగియనుంది.