- ఆరుగురిపై నమోదు చేయాలంటూ సైబరాబాద్ సీపీకి హైడ్రా కమిషనర్ సిఫారసు
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలకు అనుమతిలిచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని అక్రమ భవనాలను కూల్చివేసిన హైడ్రా.. వాటికి గతంలో అనుమతిలిచ్చిన అధికారుల లిస్టు తయారు చేస్తున్నది. ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. వీరిపై నేడో రేపో కేసులు నమోదు కానున్నాయి.
వీరిలో చందానగర్ సర్కిల్లో డిప్యూటీ కమిషనర్గా పని చేసిన ఆఫీసర్, బాచుపల్లిలో ఎంఆర్వో, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాం పేట్ మున్సిపల్ కమిషనర్, నిజాంపేట్ సర్వేయర్, మేడ్చల్–మల్కాజిగిరి డిస్ట్రిక్ట్సర్వేయర్ ఉన్నారు. మరోవైపు గండిపేట్ లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి విచారణ కొనసాగుతున్నది. ఇందులో ఇరిగేషన్ ఎస్ఈపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖకు హైడ్రా లెటర్ రాయనున్నట్టు తెలిసింది.
అధికారుల్లో టెన్షన్..
హైడ్రా కూలుస్తున్న వాటిలో కొన్నింటికి అనుమతులు లేనప్పటికి, మరికొన్ని మాత్రం అన్ని రకాల అనుమతులు తీసుకొని నిర్మించారు. ఇలాంటి వాటికి అనుమతులిచ్చిన అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి ప్రధానంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు స్థానిక మున్సిపల్ అధికారులదే కీలక పాత్ర.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీలు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు ఆక్రమణలకు అనుమతులిచ్చారు. కొన్నింటికి నకిలీ ఎన్వోసీలు ఉన్న కూడా అనుమతులిచ్చారు. అనుమతులు ఇచ్చిన వారిలో సర్వీసులో ఉన్న వారితో పాటు రిటైర్ మెంట్ అయినోళ్లు కూడా ఉన్నారు. వాళ్లందరిపైనా చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమవుతున్నది.