- భూకబ్జా చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన 42 మంది బాధితులు
- జానయ్యకు చెందిన రైస్‌మిల్లు పైనా అధికారుల దాడులు
- రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని విమర్శలు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించిన రెండు రోజులకే డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్‌పై కేసులు నమోదవడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టికెట్లు ప్రకటించినప్పటి నుంచి పార్టీలోని ఆశావహులు అసంతృప్తిని వెల్లగక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వట్టే జానయ్య కూడా తన అసమ్మతిని తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగిందని, పార్టీ ఏదైనా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
ఈ మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఈనెల 31న ఆయన అనుచరులతో భారీ మీటింగ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, అంతనేలోనే జానయ్య తమ భూమి కబ్జా చేశారని 42 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు ఆయనకు చెందిన రైస్ మిల్‌పై అధికారులు దాడులు చేశారు. పార్టీ మారుతానని చెప్పడంతోనే బీఆర్‌ఎస్‌లోని జిల్లా పెద్దలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో 42 ఫిర్యాదులు
డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ భూ అక్రమాలకు పాల్పడ్డడంటూ బాధితులు ఎస్పీ ఆఫీస్‌కు క్యూకడుతున్నారు. గాంధీ నగర్, బాలేంల, పిల్లల మర్రి తో పాటు తుంగతుర్తి, ఖమ్మం, జనగాంలలో జానయ్య తమ భూములను ఆక్రమించారని రెండురోజుల్లో 42మంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2017 నుంచి 2020 వరకు ఈ కబ్జాలు చేశారని, తాము అక్కడికి వెళ్తే అనుచరులతో దాడులు చేయించారని వాపోయారు. అంతేకాదు ఫోర్జరీ సంతకాలతోతమ భూములను ఆయన పేరున మార్చుకున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు జానయ్యపై శుక్రవారం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఎంక్వైరీ మొదలు పెట్టారు.
కక్ష సాధింపేనా..?
వట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడంతోనే రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో మంత్రి జగదీశ్ గెలవడంతో వట్టే జానయ్య యాదవ్ కీలకంగా పనిచేశారు. మంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న నేతగా గుర్తింపు ఉండడంతో పార్టీ వీడితే నష్టం జరుగుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నయానో, భయానో దారికి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2017లో భూములు కబ్జా చేశారని చెబుతున్న బాధితులు ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అంతేకాదు ఇన్నాళ్లు లేనిది అధికారులు జానయ్యకు చెందిన వజ్ర రైస్ మిల్ పై దాడులు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా, జానయ్య మూడురోజులుగా హైదరాబాద్‌లోనే ఉండగా.. ఫిర్యాదుదారులలో ఒకరు శుక్రవారం దాడి చేశారని చెబుతుండడం గమనార్హం.
బహిరంగ చర్చకు సిద్ధం
నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నరు. ఎవరో కొన్న భూములకు నాకేం సంబంధం. కావాలనే ఒక ప్రభుత్వ టీచర్‌తో నాపై కేసులు పెట్టించిన్రు. నా కారణంగా బాధితులు నష్టపోతే ఒకటికి రెండింతలు ఇస్త. నాపై చేసిన ఆరోపణలపై సూర్యాపేటలో బహిరంగ చర్చకు సిద్ధం.
వట్టే జానయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్
ఎంక్వైరీ చేస్తున్నం
భూ ఆక్రమణ, ఫోర్జరీకి సబంధించి డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్‌పై 42 మంది భాదితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిటిషన్లను ఎంక్వైరీ కోసం మున్సిపాల్, రెవెన్యూ శాఖలకు పంపిస్తున్నం. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటం.
రాజేంద్ర ప్రసాద్, ఎస్పీ, సూర్యాపేట