జనవరి 1 నుంచి బిచ్చం వేస్తే కేసు

జనవరి 1 నుంచి బిచ్చం వేస్తే కేసు
  • ఇండోర్​లో బిచ్చం వేస్తే కేసు 
  • కొత్త ఏడాది నుంచి అమలు చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం 

భోపాల్: దేశంలో అత్యంత పరిశుభ్రమైన సిటీగా పేరొందిన ఇండోర్, ఇక బిచ్చగాళ్ల రహితంగా మారనుంది. రోడ్లపై యాచకులు లేకుండా కఠిన చర్యలకు మధ్యప్రదేశ్ ​ప్రభుత్వం నిర్ణయించింది. సిటీలో భిక్షాటనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సోమవారం ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ మీడియాకు  తెలిపారు. జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా.. యాచకులకు బిచ్చం వేసినా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. యాచక వ్యతిరేక అవగాహన యాత్ర ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు. ‘‘యాచకులకు డబ్బులు ఇవ్వడం ద్వారా పాపంలో భాగస్వాములు కావొద్దని ఇండోర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న” అని ఆశిష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ పట్టణాన్ని యాచకుల రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌‌పూర్, పాట్నా, అహ్మదాబాద్ వంటి 10 నగరాల్లో అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. 

‘‘మా స్టడీలో కొంతమంది బిచ్చగాళ్లకు పక్కా ఇల్లు, మరికొందరి పిల్లలు బ్యాంకులో జాబ్​చేస్తున్నట్టు తేలింది. ఒక బిచ్చగాడిని తనిఖీ చేయగా రూ.29 వేలు లభించాయి. రాజస్థాన్ నుంచి పిల్లలతో వచ్చిన ఒక ముఠా ఇక్కడ హోటళ్లలో బస చేసి.. భిక్షాటన చేయిస్తుండగా పట్టుకొని పిల్లల్ని రక్షించాం” అని ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి యాచకులకు ఆరు నెలల పాటు ఆశ్రయం ఏర్పాటుచేసి, వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చెప్పారు.