
హైదరాబాద్, వెలుగు: అర్హతకు మించి వైద్యం చేస్తున్న 13 మంది డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 412 మంది డాక్టర్లపై కేసులు నమోదు చేసినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రావడం లేదని, అర్హతకు మించి వైద్యం అందిస్తే కఠిన చర్యలు తప్పవని టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్ హెచ్చరించారు.
గత నెలలో తనిఖీలు నిర్వహించిన టీజీఎంసీ అధికారులు బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లోని నకిలీ డాక్టర్లను గుర్తించినట్టు తెలిపారు. దుండిగల్ లో 3, బాచుపల్లిలో 2, సంగారెడ్డిలో 3, వనస్థలిపురంలో 4, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఒకరిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.