- రూ. 69 కోట్లు బకాయిపడిన ఐదు మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు
- ఎఫ్ సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ గడువును మళ్లీ పొడిగించిన సర్కారు
నాగర్ కర్నూల్, వెలుగు: రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ చివర్లో సీఎంఆర్ టార్గెట్ చేరుకోకపోవడంతో జనవరి 16 వరకు మిల్లర్ల రిక్వెస్ట్ తో ప్రభుత్వం గడువు పెంచింది. మరోసారి జనవరి 28 వరకు పొడిగించింది. 2021 నుంచి దాదాపు రూ.69 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిపడిన ఐదు మిల్లర్లపై ఆర్ ఆర్ యాక్ట్ నమోదు చేశారు. కోట్ల విలువైన ధాన్యం మాయం చేసిన మరి కొన్ని మిల్లులపై ఆర్ఆర్యాక్ట్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సివిల్సప్లై అధికారులు అంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 122 రైస్ మిల్లులు ఉంటే వానాకాలం సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కేటాయించేందుకు 47 మిల్లులే అర్హత సాధించాయి. ఇందులో అండర్ టేకింగ్, బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన 19 మిల్లులకు మాత్రమే ధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా చివరికి 50 మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఈ సీజన్లో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినా అధికారులు 252 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ధాన్యం కొనుగోలు ముగిసే నాటికి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేకపోయారు. ఈసారి సన్నాలకు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించినా రైతులు కల్లాల దగ్గరే వడ్లు అమ్ముకున్నారు.
ఈ ఐదు మిల్లుల కథ వేరు..
మిల్లులు సీజన్ల తరబడి సీఎంఆర్ బకాయిపడిన సివిల్సప్లై అధికారులు పట్టించుకోకపోగా వారికే తిరిగి ధాన్యం కేటాయించారు. ఎఫ్ సీఐ నుంచి ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక విజిలెన్స్ ఎన్‌ఫొర్స్‌మెంట్ టీంలు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాయి. తనిఖీలలో ధాన్యం నిల్వలు లేవని తేలినా విషయం బయటపడకుండా మేనేజ్ చేశారు. కల్వకుర్తి మండలంలోని శ్రీలక్ష్మీ వెంకట నరసింహ రైస్‌మిల్ రూ.50.27 కోట్ల విలువైన 17,597 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టించినా సివిల్సప్లై అధికారులు పట్టించుకోలేదు.
పవన్ ట్రేడర్స్ రూ.7.29కోట్ల విలువైన 2,465 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడింది. భ్రమరాంబిక రైస్‌మిల్ రూ. 6.6 కోట్ల విలువైన 2206 మెట్రిక్ టన్నుల ధాన్యం, అను రైస్ మిల్ రూ.3.58 కోట్ల విలువైన 1522 మెట్రిక్ టన్నుల ధాన్యం, శ్రీలక్ష్మీ రైస్ ఇండస్ట్రీస్ రూ.1.29 కోట్ల విలువైన 401 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి అందించలేదు.
Also Read :- తెలంగాణలో ఫీజుల కట్టడికి చట్టం.!సిఫారసులు ఇవే..
ప్రభుత్వం ఒక రైస్‌మిల్‌కు ధాన్యం కేటాయించే ముందు రెండు మిల్లుల నుంచి ష్యూరిటీ తీసుకున్న తర్వాతే ధాన్యం కేటాయిస్తుంది. జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ లెటర్‌ప్యాడ్‌పై రికమండ్ చేసిన లీజు మిల్లులకు ష్యూరిటీ ఇచ్చారు. కోట్లల్లో ధాన్యం బకాయిపడిన మిల్లర్లు, లీజుతీసుకుని నడిపించిన వారికి ష్యూరిటీ ఇచ్చిన మిల్లర్లపై ఏం చర్యలు ఉంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
లీజుదార్లకు సైడ్ ఇచ్చారు...
సొంతంగా రైస్‌మిల్లులు లేని వారికి లీజుకు మిల్లులు తీసుకున్న వారికి సివిల్సప్లై అధికారులు చాలా ఉదారంగా ధాన్యం కేటాయించారు. మూతబడిన పాత మిల్లుల పైకప్పులు మార్చిన వారికి, పాత మిల్లులను లీజుకు తీసుకున్న వారి నుంచి బ్యాంక్ గ్యారెంటీ అడగకుండా అసోసియేషన్ రికమండేషన్ ఆధారంగా ధాన్యం కేటాయించిన సివిల్సప్లై అధికారులు రైస్ ఎవరి నుంచి రికవరీ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ధాన్యం బకాయిపడిన మిల్లర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసులతోపాటు ఆర్ఆర్ యాక్ట్ పెడుతుందన్న సమాచారంతో కొందరు మిల్లర్లు పావులు కదిపారు. మరి కొందరు రాజకీయ పలుకుబడితో క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్టులు లేకుండా సీఎంఆర్ పెట్టేలా చూసుకున్నారు.