ముల్కీ రూల్స్​పై కేసులు

ముల్కీ రూల్స్​పై కేసులు

అర్హులైన తెలంగాణ స్థానికులు లభించకపోతే ఆ ఖాళీలను అదే విధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 1968, ఏప్రిల్​లో ఆదేశాలు జారీ చేసింది. ముల్కీల స్థానంలో షరతులతో నియమించిన నాన్​ముల్కీలను మూడు నెలల్లో తొలగించి వారి స్థానంలో అర్హులైన ముల్కీలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను అనుసరించి కొత్తగూడెం విద్యుత్​ కేంద్రంలోని నాన్​ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ విధంగా తొలగించిన నాన్ ముల్కీలు హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్​పై 1969, జనవరి 3న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ కుమరప్ప  తీర్పు చెబుతూ ఆంధ్రప్రదేశ్​ స్టేట్​ ఎలక్ట్రిసిటీ బోర్డు అటానమస్​ కావడంతో పబ్లిక్​ ఎంపాయిమెంట్​ యాక్ట్​ 1957 పరిధిలోకి రాదని తీర్పు చెప్పారు. 

తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్న రోజులు కావడంతో ఉద్యమ ధాటికి తట్టుకోలేకపోయిన ప్రభుత్వం నియమాలకు విరుద్ధంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న ఆంధ్రులను వారి ప్రాంతానికి బదిలీ చేసి వారికి ఆంధ్రలో సూపర్​ న్యూమరీ పోస్టులను సృష్టించాలన్న గౌతు లచ్చన్న సూచనను ప్రభుత్వం ఆమోదించి జీవో నెం 36ను జారీ చేసింది. దీంతో ఆంధ్రలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించిన కొందరు ఆంధ్ర ఉద్యోగులు, నాయకులు పబ్లిక్ ఎంప్లాయిమెంట్​ రిక్వైర్​మెంట్​ యాజ్​ టూ రెసిడెన్స్ యాక్ట్​ – 1957ను దానికి అనుబంధంగా 1959 మార్చి 21న రూపొందించిన నియమావళి రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు. 

జస్టిస్ చిన్నప్పరెడ్డి తీర్పు

1969, జనవరి 21న విడుదల చేసిన ఉద్యోగుల బదలాయింపు జీవో 36 చెల్లదని సవాల్​ చేస్తూ ఎం.రామారావుతోపాటు మరో నలుగురు ఎన్​జీవోలు రిట్​ అర్జీని దాఖలు చేశారు. జీవో 36 రాజ్యాంగంలోని 16వ అధికరణానికి భంగకరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు మించిందని పిటిషన్లు సవాల్​ చేశారు. ఈ పిటిషన్​పై 1969, ఫిబ్రవరి 3న హైకోర్టు న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి తెలంగాణ ప్రాంతంలోని కొన్నిరకాల ఉద్యోగాల్లో స్థానికులను మాత్రమే చేర్చుకోవాలనే ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం – 1957లోని మూడో సెక్షన్​, దీనికి అనుబంధమైన 1959 నియమావళి అమలు జరపకూడదని తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 1957లోని మూడో సెక్షన్​ 1964లో సవరణకు గురైంది. సవరించిన ఈ సెక్షన్​ చెల్లదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

తోసిపుచ్చిన డివిజన్​ బెంచ్​ 

జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్​ బెంచ్​కు అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ పింగళి జగన్మోహన్​రెడ్డి, ఆవుల సాంబశివరావులతో కూడిన డివిజన్​ బెంచ్​ చిన్నపరెడ్డి తీర్పును తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ ఎంప్లాయిమెంట్​ యాక్ట్ (1957), ఆ చట్టం కింద రూపొందించబడిన ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ ఎంప్లాయిమెంట్​ నియమాలు – 1959 చెల్లుతాయని డివిజన్​ బెంచ్​ తన తీర్పులో స్పష్టం చేసింది. ఒకవేళ సింగిల్ జడ్జి తీర్పు ప్రకారం పబ్లిక్​ ఎంప్లాయిమెంట్​ చట్టం 1957లోని సెక్షన్​ మూడు చెల్లదని, ఈ తీర్పే అమలవుతుందని అనుకున్నా అప్పుడు కూడా ముల్కీ నిబంధనలు చెల్లుతాయని, 15 సంవత్సరాల స్థానిక నివాస అర్హత అమలులో ఉంటుందని డివిజన్​ బెంచ్​ తీర్పులో స్పష్టం చేసింది.

 జీవో 36 ద్వారా ఆంధ్రకు బదిలీ చేయాలనుకున్న నాన్​ముల్కీలను బదిలీ చేయకుండా ఉన్నచోటే వారిని ఉంచి వారి కోసం ఇక్కడే అదనపు ఉద్యోగాలు సృష్టిస్తామని అడ్వకేట్​ జనరల్​ కోర్టుకు నివేదించడంతో ఆ విషయాన్ని తీర్పులో ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్​ ఉద్యోగాల నుంచి తొలగించబడే వారందరూ ప్రభుత్వ నిబంధనల కింద తెలంగాణ ప్రాంతంలోని ఆ ఉద్యోగాలు వారివి కావనే ప్రాతిపదిక మీద తొలగించబడుతారని తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల నుంచి తొలగించిపబడిన, తొలగించిన వారందరికీ ఉద్యోగాలను సృష్టించాల్సిందిగా జిల్లా పరిషత్​లకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని, అదనంగా సృష్టించబడిన ఉద్యోగాలు వారికి ఇవ్వబడుతాయని అడ్వకేట్​ జనరల్​ మాకు తెలిపినందుకు సంతోషిస్తున్నామని తీర్పులో తెలిపారు. 

హైకోర్టు ఫుల్​ బెంచ్​ తీర్పు 

తెలంగాణ ప్రాంతంంలో ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమేనని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఫుల్​బెంచ్​ 1970, డిసెంబర్​ 9న తీర్పునిచ్చింది. పూర్వపు హైదరాబాద్​ సంస్థానంలో నిజాం నవాబు జారీ చేసిన ముల్కీ నిబంధనలు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అమలులో ఉన్నట్లు పరిగణించాలని హైకోర్టు తన తీర్పులో వెలువరించింది. ముల్కీ నిబంధనలను పూర్వం హైదరాబాద్​ సంస్థానంలో నిజాం నవాబు జారీ చేశారు. 

ఈ నిబంధనల ప్రకారం హైదరాబాద్​ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఒక వ్యక్తి సంస్థానంలో 15 సంవత్సరాలు  నివాసం ఏర్పరుచుకొని ఉండాలి. ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు ఈ నివాసానికి సంబంధించిన నిబంధనను వర్తింపజేస్తూ 1957లో శాసనసభ ప్రభుత్వ ఉద్యోగాల చట్టాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో కనీసం 15 సంవత్సరాలు నివసించి ఉండాలని 1957 చట్టంలోని సెక్షన్​–3 నిర్దేశిస్తుంది. అయితే ఈ సెక్షన్​–3ను అనుసరించి ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు చెల్లవని 1969, మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 1957లోని నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, ఈ చట్టానికి పూర్వం అమలులో ఉన్న ముల్కీ నిబంధనలు పునరుద్ధరించబడినట్లు  పరిగణించాలని అందువల్ల నిజాం నవాబు జారీ చేసిన ముల్కీ నిబంధనలు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి వర్తిస్తాయని హైకోర్టు ఫుల్​బెంచ్​ 1970, డిసెంబర్​ 9న తీర్పు చెప్పింది. ఈ తీర్పునిచ్చిన ఫుల్​బెంచ్​లోని వారు ప్రధాన న్యాయమూర్తి కుమరయ్య, గోపాలరావు ఎక్బోటే, ఆవుల సాంబశివరావు. 

ముల్కీ నిబంధనలు చెల్లవు

ఆంధ్రప్రదేశ్​ అవతరణ తర్వాత ముల్కీ నిబంధనలు చెల్లనేరవని, అమలు చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  1972, ఫిబ్రవరి 14న తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఐదుగురు జడ్జీల ఫుల్​ బెంచ్​ 4–1 మెజారిటీతో ప్రకటించింది. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా ఇచ్చిన ఈ తీర్పుపై నలుగురు జడ్జీలు సంతకం చేశారు. వారు జస్టిస్​ ఓబుల్​రెడ్డి, జస్టిస్​ కొండ, జస్టిస్​ ఎ.డి.వి.రెడ్డి, జస్టిస్ ఎ.రాములు. ఈ ఫుల్​బెంచ్​లోని ఐదో సభ్యుడైన జస్టిస్​ కొండా మాధవరెడ్డి నలుగురు జడ్జీలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమైన తీర్పును ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ముల్కీ నిబంధనలు ఎంతమాత్రమూ చెల్లనేరవు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగాల (నివాసార్హతల) చట్టంలోని సెక్షన్​–3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ముల్కీ నిబంధనలు చెల్లనేరవు. ఎ.వి.ఎస్​.నరసింహారావు కేసులో ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా, ముల్కీ నియమాలు ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించడానికి వీలులేదని హైకోర్టు మెజార్టీ తీర్పు చెప్పింది. 

ముల్కీ నిబంధనలు కొట్టివేత 

జీవో 36 మూలంగా నష్టపోతున్న ఎ.వి.ఎస్​.నరసింహారావు, తదితర ఉద్యోగులు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న రిట్​ పిటిషన్​ను 1969, ఫిబ్రవరి 17న విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రాం తంలో సబార్డినేట్​ సర్వీసుల్లో నియామకానికి ముల్కీ అర్హత ఉండాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాన్​ ముల్కీలను 1969 ఫిబ్రవరి 28 నాటికి బదిలీ చేయాలని నిర్దేశిస్తున్న జీవో 36లోని రెండో భాగాన్ని సుప్రీంకోర్టు 1969 మార్చి 28న కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల(నివాసార్హతల) నిబంధనల్లోని మూడో నిబంధన రాజ్యాంగంలోని 16వ అధికరణానికి విరుద్ధమైందని, అందువల్ల ఇది చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆఖరి తీర్పు

తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో 15 సంవత్సరాలపాటు స్థానికంగా నివాసం ఉన్నవారినే ముందు నియమించాలన్న ముల్కీ నిబంధన ఆంధ్రలో తెలంగాణను విలీనం చేసినా గానీ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ముల్కీ నిబంధ నలు చట్ట రూపంలో అమలులో ఉన్నా యని, 1956, నవంబర్​ 1న ఆంధ్రప్రదేశ్​ అవతరించే వరకు రాజ్యాంగంలోని 16(3) అధికరణం కింద రక్షంచబడినవి అని తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు చెల్లుబాటు కావాలని, దీని ప్రయోజనాలకు రాష్ట్రాల పునర్విభజన పరిస్థితులకు సంబంధం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. 

రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు చెల్లుబాటులో ఉన్న ముల్కీ నిబంధనలు పార్లమెంట్​ మార్చే వరకు లేదా సవరించే వరకు లేదా తొలగించే వరకు కొనసాగుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ముల్కీ నిబంధనలు కష్టసాధ్యమన్న విషయంతో తమకు నిమిత్తం లేదని తగిన నివారణ మార్గాలను చూపాల్సింది పార్లమెంటేనని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​.ఎం.సిక్రి పేర్కొన్నారు.