ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై నిషేధాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలని బల్దియా కమిషనర్ ఆదేశించారు.
శనివారం సికింద్రాబాద్‌లో జరిగిన సిటీ సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు. అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ నెల 20వ తేదీ లోపు సిటీలోని అన్ని రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేసి, ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
నగరంలో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు పై నిషేధాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో
అమలు చేయాలని సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. బేగంపేట్ టూరిజం
ప్లాజాలో శనివారం జరిగిన సమావేశంలో బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేశ్ మాట్లాడుతూ.. నగర సుందరీకరణ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు . వివిధ ప్రారంభోత్సవాలు, ఉత్సవాల సందర్భంగా ప్రధాన రహదారులు, కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారికి ఫైన్‌తో పాటు కేసులు కూడా నమోదు చేయాలన్నారు .
బల్దియా నిర్వహించే అన్ని పార్కులకు ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించాలని చెప్పారు . పాత ముంబయి దారిలో క్యారేజ్ వే నిర్మాణానికిగాను అడ్డుగా ఉన్న మూడు దేవాలయాలను మరో చోట నిర్మించడానికి తగు స్థలాన్ని కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశామని, త్వరగా భూమి కేటాయించాలని కోరారు. ఈ నెల 20వ తేదీ లోపు సిటీలోని అన్ని రహదారులపై ఉన్న గుంతలను పూడ్చివేయడంతో పాటు ప్యాచ్ వర్క్‌లు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం సాధించేందుకు ప్రతి గురువారం జోనల్ స్థాయిలో కన్వర్జెన్స్ సమావేశాలను నిర్వహించుకోవాలన్నారు . సమావేశంలో జోనల్ కమిషనర్లు హరిచందన , శ్రీనివాస్‌రెడ్డి, మమత , ఉపేందర్‌రెడ్డి, సామ్రాట్ అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.