కేరళలో రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్న కేసుల్లో 50 శాతానికి పైగా ఈ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బులెటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 32,801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్క రోజులో 179 మంది కరోనాతో మరణించారు. అయితే శుక్రవారం 18,573 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం టోటల్ పాజిటివిటీ రేటు 19.22 శాతంగా ఉందని, మొత్తం మరణాల సంఖ్య 20,313కి చేరాయని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులెటెన్‌లో పేర్కొంది. అయితే ఈ కేసుల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు.
కేరళలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ సివియారిటీ తక్కువగానే ఉందని, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు 50 శాతం లోపే ఫిల్ అయ్యాయని చెప్పారు. మరణాల రేటు 0.5 శాతంగా ఉందన్నారు. దేశం మొత్తంలోనే ఇప్పటికీ కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటని అన్నారు. రిపోర్ట్ అవ్వని కేసుల నిష్పత్తి కేరళలో 1:6 ఉంటే, దేశంలోని చాలా రాష్ట్రాల్లో 1:100గా ఉందని వీణా జార్జ్ తెలిపారు. మే నెలలో రోజు వారీ కేసులు 40 వేలకు పైగా ఉండేవని, అయినప్పటికీ ట్రీట్‌మెంట్ అందించే విషయంలో ఎక్కడా మెడిసిన్స్ గానీ, ఇతరత్రా అవసరాల విషయంలోగానీ కొరత రాలేదని గుర్తు చేశారు. పైగా ఐసీఎంఆర్ నిర్వహించిన సీరో సర్వే ప్రకారం కేరళ జనాభాలో దాదాపు 50 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని ఆరోగ్య మంత్రి వీణ అన్నారు. అయినప్పటికీ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పక్కాగా పాటించాలని ఆమె కోరారు. ప్రజలు గుంపులు చేరడం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాంటివి తగ్గించుకోవాలని సూచించారు.
70 శాతం మందికి వ్యాక్సిన్
కేరళలో వ్యాక్సినేషన్ చాలా వేగవంతంగా జరుగుతోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారిలో 70.24 శాతం మందికి ఫస్ట్ డోస్ పూర్తయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి వ్యాక్సిన్ కేటాయింపు బాగా పెంచిందని ఆమె తెలిపారు.