గంజాయి మత్తులో యూత్ .. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్​కు కేసులు

గంజాయి మత్తులో యూత్ .. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్​కు కేసులు
  • డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్
  • బానిసవుతున్నోళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్లే
  • ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్​కు నెలకు పదుల సంఖ్యలో కేసులు 
  • ప్రైవేట్ డీఅడిక్షన్ సెంటర్లకు వెళ్తున్నోళ్లు వేలల్లోనే..

హైదరాబాద్, వెలుగు:  యువత మత్తుకు బానిసవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్స్​తో మొదలుపెట్టి చివరకు గంజాయి, డ్రగ్స్ కు కూడా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గంజాయికి బానిసవుతున్నోళ్ల సంఖ్య  పెరుగుతున్నది. స్కూళ్లు, కాలేజీలు అడ్డాగా గంజాయి మాఫియా విస్తరిస్తుండడంతో బాధితుల్లో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు పేరెంట్స్ వాళ్లను గుర్తించి డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లోని డీఅడిక్షన్ సెంటర్ కు రోజూ పదుల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. ఇక ప్రైవేట్ డీఅడిక్షన్ సెంటర్లలో ట్రీట్​మెంట్​తీసుకుంటున్నోళ్ల సంఖ్య వేలల్లోనే ఉంటుందని తెలుస్తున్నది. మరోవైపు యువత కేవలం గంజాయికి మాత్రమే కాకుండా ఓపియాడ్, బెంజోడయాజిపైన్ లాంటి నిద్ర మాత్రలు, పెయిన్ కిల్లర్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటోళ్లలో కొందరిని పేరెంట్స్​ గుర్తించి ట్రీట్​మెంట్ ఇప్పిస్తుండగా, మరికొందరు మత్తులో ఊగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

ఫ్యాషన్​గా ఫీలవుతూ అడిక్ట్.. 

హైదరాబాద్​లో గుర్తింపు ఉన్నవి, లేనివి కలిపి100కు పైగా డీఅడిక్షన్ సెంటర్లు ఉన్నాయి.ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లోని డ్రగ్ ట్రీట్ మెంట్ క్లినిక్ (డీటీసీ)కు నెలకు సగటున 20 మంది గంజాయి బాధితులు వస్తుండగా, ఇతర ప్రైవేట్ సెంటర్లకు వేలల్లోనే బాధితులు వస్తున్నట్టు తెలుస్తున్నది. వీరిలో 25 ఏండ్లలోపు వయసు వారే ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్, బీటెక్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఆల్కహాల్, సిగరెట్లు,  గంజాయి, డ్రగ్స్ తీసుకోవడాన్ని యువత ఫ్యాషన్​ గా ఫీల్​అవుతున్నారని అంటున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ఫ్రెండ్స్ ద్వారా మందు, సిగరెట్​ నుంచి క్రమంగా గంజాయి, డ్రగ్స్​ తీసుకునే వరకు వెళ్తున్నారని చెబుతున్నారు. ‘‘కొందరు స్టూడెంట్లు స్లీపింగ్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్​కూడా తీసుకుంటున్నారు. ఎర్రగడ్డకు ఓపియాడ్ తో పాటు బెంజోడయాజిపైన్ లాంటి ట్యాబ్లెట్స్ బాధితులు కూడా వస్తున్నారు. పిల్లలపై పేరెంట్స్ మాత్రమే కాదు స్కూల్, కాలేజీల్లో టీచర్స్, లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా కన్నేసి ఉంచాలి” అని డాక్టర్లు సూచిస్తున్నారు. 

తొందరగా గుర్తిస్తే ట్రీట్ మెంట్ ఈజీ 

మత్తు పదార్థాలకు అలవాటుపడినోళ్లను తొందరగా గుర్తించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే త్వరగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ‘‘మత్తుకు బానిసలైనోళ్లను ముందుగా పరీక్షిస్తాం. వాళ్లు మత్తు పదార్థాలకు ఎలా అలవాటు అయ్యారు? ప్రస్తుతం వారి మానసిక స్థితి​ఏంటి? అనే విషయాలు తెలుసుకొని ట్రీట్​మెంట్​ప్రారంభిస్తాం. ప్రభావం తక్కువగా ఉన్నోళ్లు ఇంటి వద్దే ఉంటూ మెడిసిన్​వాడి, రెండు వారాలకు ఒకసారి కౌన్సెలింగ్​ తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్రభావం ఎక్కువగా ఉన్నవారిని ఇన్ పేషంట్స్​గా అడ్మిట్​చేసుకొని ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మెడిసిన్స్, కౌన్సెలింగ్​తో పాటు ఇంజక్షన్స్​ద్వారా ట్రీట్​మెంట్ అందిస్తాం. అయితే సాధారణంగా ట్రీట్​మెంట్ నెల రోజుల్లో పూర్తవుతుంది. బాధితుడి కండీషన్​ను బట్టి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది” అని ఎర్రగడ్డ హాస్పిటల్ లోని సైకియాట్రిస్ట్ డాక్టర్​ఫణికాంత్​తెలిపారు. అయితే డీ అడిక్షన్​సెంటర్ల గురించి చాలా మందికి తెలియకపోవడం, వీటి గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ట్రీట్​మెంట్ కోసం అంతంత మాత్రంగానే వస్తున్నారు. డీటీసీ సెంటర్లలో డ్రగ్స్​కు బానిసలవ్వడం వల్ల కలిగే నష్టాలతో పాటు ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలో కౌన్సెలింగ్​ద్వారా చెబుతారు. అవసరమైతే పేరెంట్స్​ అంగీకారంతో ట్రీట్​మెంట్​ప్రారంభిస్తారు.

  పిల్లలపై పేరెంట్స్ దృష్టి పెట్టాలి 

యువత ఎక్కువగా గంజాయికి బానిసవుతున్నారు. మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతుండడంతో వాటికి అడిక్ట్ అవుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడినోళ్లు ఎప్పుడూ కోపం, చిరాకు, ఆందోళనగా కనిపిస్తారు. చదువు మీద దృష్టి పెట్టలేరు. ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. తమపై దాడి చేస్తారేమోనన్న భయంతో ఇతరులపై  అగ్రెస్సివ్ గా బిహేవ్ ​చేస్తారు. పిల్లలపై పేరెంట్స్​ దృష్టి పెట్టాలి. వారి కదలికలను గమనిస్తూ ఉండాలి.  ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసైయినట్టు గుర్తిస్తే వెంటనే ట్రీట్​మెంట్​ ఇప్పించాలి. మందులు, కౌన్సెలింగ్ ​ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురాగలం.
 

- డాక్టర్ ఉమా శంకర్, సూపరింటెండెంట్, ఎర్రగడ్డ హాస్పిటల్  

హైదరాబాద్ కు చెందిన సంతోష్ సిటీ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. కాలేజీకి రెగ్యులర్​గా వెళ్లి, అయిపోగానే ఇంటికి తిరిగొచ్చే సంతోష్.. కొన్ని నెలలుగా ఇంటికి సరిగ్గా రావట్లేదు. ఒకవేళ వచ్చినా అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి వచ్చేవాడు. ఏమైందని పేరెంట్స్ అడిగితే కోపగించుకునేవాడు. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. సంతోష్ లో వచ్చిన మార్పులను గమనించిన పేరెంట్స్.. ఏమైందని ఫ్రెండ్స్ దగ్గర ఆరా తీశారు. సంతోష్ చాలా రోజుల నుంచి కాలేజీకి రెగ్యులర్ గా వెళ్లట్లేదని, కాలేజీ ఫ్రెండ్స్ ద్వారా గంజాయి, సిగరెట్లకు అడిక్ట్ అయ్యాడని తెలిసింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోయిందని పేరెంట్స్​కు అర్థమైంది. వెంటనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లోని డీఅడిక్షన్ సెంటర్​కు సంతోష్ ను తీసుకొచ్చారు. అన్ని విధాలుగా పరీక్షించిన డాక్టర్లు.. మెడిసిన్స్ తో పాటు కౌన్సెలింగ్​ ఇవ్వడం ప్రారంభించారు. నెల రోజుల్లో సంతోష్ ​సాధారణ స్థితికి చేరుకున్నాడు.