
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆర్టిస్ట్ లు విష్ణుప్రియ, రీతూ చౌదరి మొదలైన వారు పోలీసుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఉన్న మిగతా వారందరినీ విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. తాజాగా బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ అంశాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించిన వివరాలను చెబుతూనే తీవ్రమై హెచ్చరికలు చేశారు.
తెలంగాణలో బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ బ్యాన్ ఉందని, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారిపై కేసులు తప్పవని హెచ్చరించారు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్. బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేస్తున్న వాళ్ల గురించి ఆరా తీస్తున్నట్లు చెప్పారు. బెట్టింగ్ ఆడిన వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. యాప్స్ ప్రమోట్ చేసిన వారే కాకుండా.. యాప్ లలో ప్రచారంలో కనిపిస్తున్న వాళ్ల పైనా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణలో 2022 నుంచి మొత్తం 797 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పంజాగుట్ట, సైబరాబాద్ పరిధిలో కలిపి 33 మందిపై కేసులు నమోదయ్యాయని అన్నారు. బెట్టింగ్ యాప్‌ల్లో సొమ్ము పోగొట్టుకుంటే తిరిగి చేతికి రావడం అసాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న దేశాలను బ్యాన్ చేయాలని సూచించినట్లు శిఖాగోయల్ తెలిపారు.