హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వేస్తున్న వరి కుప్పలు, ధాన్యం కుప్పల వల్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. రోడ్లపై ధాన్యం పోస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈనెల 11వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో శనిగరం గ్రామ శివారులో కారు ప్రమాదానికి గురై నలుగురు చనిపోవడానికి ధాన్యం కుప్పలే కారణమని ఏసీపీ తెలిపారు. పరకాలకు వెళ్తున్న కారు అదుపుతప్పి లారీని గుద్దడం వల్ల స్పాట్ లో ముగ్గురు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని.. మరో ఇద్దరు గాయపడ్డారని ఏసీపీ తెలిపారు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేయగా.. రైతులు ఆరబెట్టిన ధాన్యం కుప్పలు ప్రమాదానికి కారణమయ్యాయని గుర్తించి రైతుపై కేసు నమోదు చేశామన్నారు.
ఉప్పల్ నుంచి కమలాపూర్ అలాగే..హుజూరాబాద్ నుంచి పరకాల రోడ్ల మీద రైతులు వడ్లను.. ధాన్యాన్ని పోసి ఆరబెట్టుకోవడం గుర్తించామని.. ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విషయాన్ని రైతులు గుర్తించి స్వీయ నియంత్రణ చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని పొలం దగ్గరే ఆరబెట్టుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు.