
- వెయ్యి నుంచి 5 వేల దాకా పంచుతున్న అభ్యర్థులు
- కలెక్టర్కు ఫిర్యాదు చేసిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి
నల్గొండ/ కొత్తగూడెం, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ మొదలుపెట్టారు. ఒక అభ్యర్థి పక్షాన గుర్తుతెలియని వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రాంత టీచర్లకు రూ.2 వేల చొప్పున ఫోన్ పే చేసి ‘పూలు’ అని మెసేజ్ పంపారు. అయితే, కొంతమంది టీచర్లు వాటిని తిరస్కరించి రిటర్న్ పంపించారు. మరొక సంఘానికి చెందిన అభ్యర్థి తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.1000, ఖమ్మంలో రూ 2వేలు, మహబూబాబాద్ జిల్లాలో రూ.5 వేలు పంపిణీ చేసినట్లు సమాచారం. జాతీయ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థి ఇంటింటికి రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
డబ్బుల పంపిణీపై కలెక్టర్కు ఫిర్యాదు..
టీచర్లకు డబ్బుల పంపిణీ పై యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి.. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. ఓటర్లకు ఫోన్ పే ద్వారా పంపించిన స్క్రీన్ షాట్స్ ను అందజేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎందుకు నగదు పంపిణీ చేశారో విచారణ చేపట్టాలని కోరారు.
ఎన్నికల కమిషన్ డబ్బు పంపిణీని అడ్డుకోవాలి..
పోటీలో ఉన్న అభ్యర్థులు తాము దిగజారి.. ఉపాధ్యాయుల విలువను దిగజారుస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసా చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు తాము చేసిన సేవలను వివరించి ఓట్లడగటం కాకుండా డబ్బు పంపిణీ చేసి గెలవాలనుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ డబ్బు పంపిణీని అడ్డుకోవాలని, పంపిణీ చేసే అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీచర్లు తాయిలాలను తిరస్కరించాలని.. ఇలా డబ్బుతో ఓట్లను కొనే అభ్యర్థులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని, తమ వృత్తి గౌరవాన్ని కాపాడాలని వారు పిలుపునిచ్చారు.