ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. భారీగా నోట్ల కట్టలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. భారీగా నోట్ల కట్టలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయనను మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. ప్రమాదం గురించి ఆయన కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.

జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికాయని.. అవి లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ విషయంపై పై అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ జస్టిస్ కొలీజియం సమావేశానికి పిలుపునిచ్చారు. 

ఈ క్రమంలో జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయనను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ కి బదిలీ చేయాలని నిర్ణయించింది కొలీజియం. ఆయన అలహాబాద్ నుంచి 2021 అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టుకు మారినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను బదిలీతో వదిలేయకూడదని.. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఘటన అని పేర్కొంది కొలీజియం. జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని.. అందుకు నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా ఆయనను తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ను కోరింది కొలీజియం.