బిజినెస్ డెస్క్, వెలుగు: యూపీఐ విస్తరించినా, ప్రభుత్వం డిజిటల్ ఎకానమీకి పెద్ద పీట వేస్తున్నా దేశంలో క్యాష్ ఇంకా కింగ్‌గా కొనసాగుతోంది. కరెన్సీ మార్పిడిలో టాప్‌లో ఉంది. ఈ ఏడాది మార్చిలో ఏటీఎం విత్‌డ్రాయల్స్ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లకు పెరిగాయని, డీమానిటైజేషన్ తర్వాత 235 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయని ఏటీఎం మేనేజ్‌మెంట్ సర్వీస్‌లను అందించే సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. డీమానిటైజేషన్ తర్వాత కేవలం 76 నెలల్లోనే విత్‌డ్రాయల్స్ భారీగా పెరిగాయని వెల్లడించింది. కన్జూమర్ల క్యాష్ వాడకంపై ఇస్తున్న మొదటి ఇండస్ట్రీ రిపోర్ట్ ఇదే కాగా, 2022–23 లోని ట్రెండ్స్‌ను అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో సీఎంఎస్ పోల్చింది. తాము ఏటీఎంలను నింపడం 2022–23 లో 16.6 శాతం పెరిగిందని సీఎంఎస్ రిపోర్ట్ పేర్కొంది.
సర్క్యులేషన్‌లోని కరెన్సీ జూమ్..
కరెన్సీ సర్క్యులేషన్ 2014 మార్చిలో 13 లక్షల కోట్లుగా రికార్డ్ కాగా, కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ రూ.31.33 లక్షల కోట్లకు ఎగిసింది. ఈ విషయాన్ని ఈ ఏడాది మార్చిలో లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం సర్క్యులేషన్‌లోని కరెన్సీ, జీడీపీ మధ్య రేషియో 12.4 శాతానికి పెరిగిందని, ఇది 10 ఏళ్ల యావరేజ్ 11.8 శాతం కంటే ఎక్కువని సీఎంఎస్ రిపోర్ట్ వెల్లడించింది. 2016 లో ఈ రేషియో 8.7 శాతం టచ్ చేసిందని గుర్తు చేసింది. కానీ, ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం, సర్క్యులేషన్‌లోని కరెన్సీ (బ్యాంక్ నోట్లు, కాయిన్లు) , జీడీపీ రేషియో కిందటేడాది మార్చిలో 13.7 శాతంగా రికార్డయ్యింది. 2014 మార్చిలోని 11.6 శాతం నుంచి పెరిగింది. కాగా, సర్క్యులేషన్ నుంచి రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని కిందటి వారం ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కరెన్సీ సర్క్యులేషన్‌లో రూ.2 వేల నోట్ల వాటా కిందటేడాది సెప్టెంబర్ నాటికి 10.8 శాతంగా అంటే రూ.3.62 లక్షల కోట్లుగా ఉంది.
క్యాష్ ముఖ్యం..
దేశ ఆర్థిక వ్యవస్థలో క్యాష్ ఎంత కీలకంగా ఉందో సీఎంఎస్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. తాము ఏటీఎంలను నింపడం ప్రతీ నెల సగటున 10.1 శాతం పెరుగుతోందని ఈ కంపెనీ ప్రెసిడెంట్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) అనుష్ రాఘవన్ పేర్కొన్నారు. 2022–23 లో తాము ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎంలను నింపామని పేర్కొన్నారు. తాము ఏటీఎంలలో నింపిన మొత్తం క్యాష్‌లో 43.1 శాతం వాటా ఈ రాష్ట్రాల నుంచే ఉందని అన్నారు. గ్రాస్ స్టేట్ జీడీపీలో ఈ ఐదు రాష్ట్రాలు టాప్‌లో ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
కర్నాటకలోనూ క్యాషే..
ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు నెలవుగా మారిన కర్నాటకలో ఏటీఎంలలో క్యాష్ నింపడం ఎక్కువగా జరిగిందని సీఎంఎస్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రాష్ట్రంలో 2022–23 లో యావరేజ్‌గా ఒక ఏటీఏంలో రూ.1.73 కోట్లు నింపామని వెల్లడించింది. అంతకు ముందు ఏడాదిలో యావరేజ్‌గా నింపిన రూ.1.46 కోట్లతో పోలిస్తే ఇది 18.1 శాతం ఎక్కువ. ఆ తర్వాత ప్లేస్‌లో ఛత్తీస్‌గడ్ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక ఏటీఎంలో సగటున రూ.1.58 కోట్లను నింపామని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 2.1 శాతం తక్కువని సీఎంఎస్ రిపోర్ట్ పేర్కొంది. కరెన్సీ సర్క్యులేషన్‌లో ఇండియా టాప్‌లో కొనసాగుతోంది. 421 బిలియన్ డాలర్లతో 2021 లో ప్రపంచంలోనే థర్డ్ హయ్యెస్ట్ యాన్యువల్ గ్రోత్ (7.9 శాతం) నమోదు చేసిన దేశంగా నిలిచింది. యూకే (11.8 శాతం), చైనా (10.2 శాతం) మన కంటే
ముందున్నాయి.
జీడీపీ పెరుగుతుండడంతో..
‘చాలా మంది ప్రజలకు సరియైన బ్యాంకింగ్ సర్వీస్‌లు అందడం లేదు. వీరు తమ రోజువారి కార్యకలాపాల కోసం క్యాష్ పైనే ఆధారపడుతున్నారు. డిజిటల్ లిటరసీ తక్కువగా ఉండడం, గ్రామీణ స్థాయిల్లో డిజిటల్ పేమెంట్స్ ఇంకా విస్తరించకపోవడం, సెక్యూరిటీ భయాలు క్యాష్‌ను కింగ్‌గా నిలుపుతున్నాయి’ అని సీఎంఎస్ రాఘవన్ పేర్కొన్నారు. క్యాష్ వాడకం ఎక్కువగానే ఉన్నా, డిజిటల్ పేమెంట్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. ‘2016 తర్వాత క్యాష్ వాడకం 83 శాతం పెరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది. జీడీపీ పెరుగుతుండడంతో ఎకానమీలో క్యాష్ ఫ్లో కూడా పెరిగింది. క్యాష్ వాడకం టాప్‌లోనే ఉన్నప్పటికీ, డిజిటైజేషన్ వేగంగా విస్తరిస్తోంది’ అని నియోజిన్ ఫిన్‌టెక్ సీఈఓ తశ్విందర్ సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్‌లు విస్తరించడంతో చాలా మంది ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్‌లోకి వచ్చారని, ఇది ఎకానమీ గ్రోత్‌కు సపోర్ట్‌గా నిలుస్తోందని అన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ, నియో బ్యాంకింగ్, ఫిన్‌టెక్ వంటివి విస్తరిస్తుండడంతో ఇండియా క్యాష్ లెస్ ఎకానమీ వైపు మరలుతోందని వివరించారు.