మ్యూచువల్ ఫండ్స్ తెలివైన ఆట.. తొందరలో రిటైల్ ఇన్వెస్టర్స్, ఏమైందంటే?

మ్యూచువల్ ఫండ్స్ తెలివైన ఆట.. తొందరలో రిటైల్ ఇన్వెస్టర్స్, ఏమైందంటే?

Mutual Funds: నేడు ట్రంప్ టారిఫ్స్ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో భారీగా పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. అయితే మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుని తమ నష్టాలను తగ్గించుకోగలిగాయి. ట్రంప్ టారిఫ్స్ అమలులోకి రావటానికి ముందే కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులను చూసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ముందస్తుగా పరిస్థితులను గ్రహించి లాభాల స్వీకరణకు మెుగ్గుచూపాయి. దీంతో గడచిన 6 ట్రేడింగ్ సెషన్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్ నికర అమ్మకం దారులుగా మార్కెట్లో కొనసాగాయి. కొన్ని రోజుల కిందట మార్కెట్లు అందించిన లాభాలు ఆవిరికాకమునుపే మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు వాటిని క్యాపిటలైజ్ చేశారు. మార్చి 20 నుంచి 28 వరకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏకంగా రూ.16 వేల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించి లాభాలను స్వీకరించాయి.

అలాగే మార్కెట్లో భారీ కరెక్షన్ తర్వాత తిరిగి పుంజుకుంటున్న సమయంలో మార్చి 1 నుంచి 19 వరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు భారీగా కొత్త కొనుగోళ్లు చేపట్టాయని డేటా వెల్లడైంది. ఈ మూడు వారాల కాలంలో ఏకంగా రూ.22వేల 900 కోట్ల విలువైన పెట్టుబడులను చేపట్టాయి. మార్చి నెలలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 5.8 శాతం పెరగగా మరో కీలక సూచీ నిప్టీ 6.3 శాతం వృద్ధిని చూసింది. ఇదే సమయంలో స్మాల్ క్యాప్ సూచీ 8.3  శాతం, మిడ్ క్యాప్ సూచీ 7.6 శాతం మేర లాభపడ్డాయి. అయితే ఇదే కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు బై ఎట్ డిప్స్ స్ట్రాటజీని ఫాలో అవుతూ కొత్త పెట్టుబడులు చేపట్టారు. వారు ప్రస్తుత మార్కెట్ల పతనంలో నష్టాలను చూస్తున్నారు.

Also Read : అమెరికాలోని తెలుగు టెక్కీలకు వార్నింగ్

జనవరిలో దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీల వద్ద రూ.1లక్ష 42వేల కోట్లు యాక్టివ్ ఈక్విటీ పెట్టుబడుల్లో క్యాష్ నిల్వలు ఉండగా.. ఫిబ్రవరిలో రూ.1లక్ష 46వేల కోట్లకు చేరుకున్నాయి. అంటే ఈ డబ్బులు ఎందులోనూ పెట్టుబడులు పెట్టకుండా కంపెనీలు మంచి అవకాశం కోసం ఎదుచూస్తున్నట్లు అర్థం. ఈ పెరుగుతున్న నగదు నిల్వలు.. వాల్యుయేషన్స్, మార్కెట్ దిశపై లోతైన ఆందోళనలను సూచిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలి గరిష్టాల నుండి దాదాపు 12 శాతం సూచీల కరెక్షన్ జరిగినప్పటికీ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల చుట్టూ ఉన్న అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్స్ ప్రకటన, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ జాగ్రత్త వైఖరి వెనుక ఉన్న కీలక కారణం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో కొనసాగుతున్న పదునైన అమ్మకాలేనని ఛాయిస్ వెల్త్ వైస్ ప్రెసిడెంట్ నికుంజ్ సరాఫ్ పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద పెరుగుతున్న నగదు నిల్వలు పెట్టుబడిదారులకు మార్కెట్ల కరెక్షన్ లేదా పతనం వల్ల వచ్చే నష్టాల నుంచి కాపాడటానికి, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవడానికి నిధులను చేతిలో ఉంచుకోవటానికి ఒక రక్షణాత్మక వ్యూహంగా చెప్పుకోవచ్చు. 

మ్యూచువల్ ఫండ్స్ 2025లో ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల్లో రూ.1.08 లక్షల కోట్లకు పైగా కొనుగోళ్లు చేపట్టాయి. అయితే 2024లో సదరు సంస్థలు మెుత్తంగా రూ.4.3 లక్షల కోట్లకు పైగా కొనుగోళ్ల ద్వారా పెట్టుబడులు పెట్టాయి. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు రానున్న కాలంలో విడుదలయ్యే కార్పొరేట్ నాల్గవ త్రైమాసిక, వార్షిక ఆదాయాలు, ఆర్థిక వృద్ధి గణాంకాలు, ద్రవ్యోల్బణం డేటాకు అనుగుణంగా తమ వద్ద మూలుగుతున్న నగదు నిల్వలను కొత్త పెట్టుబడులకు ఉపయోగించే అవకాశం ఉంది. కానీ రిటైల్ పెట్టుబడిదారులు మాత్రం ప్రస్తుత గందరగోళ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి లాభాల కంటే నష్టాలను ఎక్కువగా చూస్తున్నారు. కానీ దీర్ఘకాలిక వ్యూహంలో మాత్రం మంచి రాబడులు పొందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.