
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు వివాదం కేసులో విచారణ వేగవంతం చేశారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ విచారణ ప్రారంభించింది.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు సీజేఐ సంజీవ్ ఖన్నా మార్చి 22న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం (మార్చి 25) ఈ ప్యానెల్ సభ్యులు ఢిల్లీలోని 30, తుగ్లక్ క్రెసెంట్‌లోని జస్టిస్ వర్మ ఇంటిని పరిశీలించారు. కమిటీ సభ్యులు జస్టిస్ వర్మ నివాసంలో దాదాపు అరగంట సేపు పరిశీలించారు. ఈ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధవాలియా,కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ లు ఉన్నారు.
మార్చి 14న రాత్రి ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. అయితే అగ్ని ప్రమాదం తర్వాత నగదు బయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలను స్వయంగా సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను 2021లో అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపించాలని కేంద్రాన్ని సిఫార్సు చేస్తూ CJI నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం తీర్మానాన్ని జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ న్యాయపరమైన పని చేయకూడదని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.
మరోవైపు నగదు వివాదంలోని ఆరోపణలను జస్టిస్ వర్మ తీవ్రంగా ఖండించారు. తాను గానీ కుటుంబ సభ్యులు గానీ ఎవరూ అధికారిక నివాసం స్టోర్‌రూమ్‌లో ఎప్పుడూ నగదు ఉంచలేదని అన్నారు. నగదు దొరికిందనే ఆరోపణ అప్రతిష్టపాలు చేయడానికి కుట్రగా కనిపిస్తోందని అన్నారు.
అయితే జస్టిస్ వర్మను బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం అలహాబాద్ హైకోర్టును చెత్త కుప్ప అనే ప్రశ్నను లేవనెత్తుతుందని బార్ బాడీ తీవ్ర పదజాలంతో ఓ ప్రకటన విడుదల చేసింది.