గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీ చేసి రూ.2.19 కోట్లు పట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లకు పంచేందుకు డబ్బులు దాచిపెట్టారని, ఆ ఇంటిని తనిఖీ చేయాలని సీ‒విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు ప్లయింగ్ స్క్వాడ్ ఎండీ సినారుద్దీన్ టీమ్ తనిఖీ చేయగా రూ.2,18,90,000 పట్టుబడ్డాయని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు.
ఆ డబ్బును సోమవారం రాత్రి ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. డబ్బుతో పాటు ఓ జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి ఫొటోతో ముద్రించిన టీ‒షర్ట్‌లు, పంచడానికి సిద్ధంగా ఉన్న సీసపు వాటర్ బాటిల్స్, ప్రచార కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. మరోవైపు ఆదివారం రామగుండం బి‒పవర్‌హౌజ్ గడ్డ వద్ద వెహికిల్స్ తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న కారులో తనిఖీ చేయగా రశీదులు లేని రూ.50 లక్షల క్యాష్దొరికింది. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకుని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్టు సీపీ చెప్పారు.