‘ఆడవాళ్లకు నగదు బదిలీ’ భారత ఎన్నికల రాజకీయాల్లో తిరుగులేని బ్రహ్మాస్త్రమయిందా? అదే, పాలకపక్షాలకు అనుకూలంగా తాత్కాలిక ఓటు బ్యాంకుల్ని సృష్టిస్తోందా? హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘స్త్రీ కేంద్రక సంక్షేమ’ సర్కార్లు తిరిగి ఎన్నికై అధికారం నిలబెట్టుకున్న దరిమిలా.. ఢిల్లీ ‘ఆప్’ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇదే భావన కలిగిస్తోంది. అసలు, భారతీయ మహిళ.. కుటుంబమో, కులమో, వర్గమో అనే ప్రాతిపదికన కాక... ఆర్థిక ప్రయోజనాలను బట్టి ఓటేసే స్వీయ నిర్ణయ స్థితికి చేరిందా? ఇపుడివన్నీ ప్రశ్నలే! శాస్త్రీయ అధ్యయనంతో సాపేక్షంగా నిర్ధారిస్తే తప్ప తేలని అంశమిది! అయితే, ఆరు మాసాల కింద ఆంధ్రప్రదశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వైరుధ్యాన్నిబట్టి పరస్పర విరుద్ధ అభిప్రాయాలకు ఆస్కారం కలుగుతోంది. ఇంతకీ నిజమేంటనేది నిలకడపై తేలాల్సిందే!
పురుషాధిక్య వ్యవస్థపై పలు సామాజిక తిరుగుబాట్ల మీదట స్త్రీ క్రమంగా తన స్థానాన్ని పదిలపరచుకుంటున్న యుగంలో ఉన్నాం. స్వల్ప హెచ్చుతగ్గులున్నా.. మహిళా జనాభా పురుషులతో సమంగానే ఉంటోంది. ఓటు వాటాల్లోనూ స్వల్ప తేడాలున్నాయి. కొన్నిచోట్ల పురుష ఓటర్లు అధికంగా ఉంటే మరి కొన్ని చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ఓటింగ్‌లో పాల్గొనటంలో పెరుగుదల గత రెండున్నర దశాబ్దాల పరిణామం. అంతకుముందు, ఓటింగ్‌లో పాల్గొనే స్త్రీ, పురుష ఓటర్లలో తేడా పదిశాతంపైనే ఉండేది. ఇప్పుడది సగటున ఒక శాతానికి పడిపోయింది. దాంతో, తమ గెలుపుకోసం ‘మహిళా ఓటు’ను రాజకీయ పార్టీలు లక్ష్యం చేసుకుంటున్నాయి.
నగదు వైపు నారీ మొగ్గు?
పార్టీలు, వాటి విధానాలు, సిద్ధాంతాల కన్నా.... ఆర్థిక మేలు, నగదు బదిలీల వైపు భారత సగటు మహిళ మొగ్గుతోందా? ఇటీవల ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించినపుడు ఇదే అనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోని సామ్యం దీన్నే ధ్రువపరుస్తోంది. రెండు చోట్ల పాలక కూటములు భారీ మెజారిటీతో మళ్లీ ఎన్నికయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ మహిళా కేంద్రక ‘నగదు బదిలీ’ కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చి గెలుపుబాట పట్టించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించి, అధికారం నిలబెట్టుకోవడంలో మహిళా మద్దతు కలిసి వచ్చిందనేది సగటు విశ్లేషణ!
గెలుపు మంత్రాలు!
జార్ఖండ్‌లో ‘ముఖ్యమంత్రి మాయి సమ్మాన్ యోజన’ కింద ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు అందజేశారు. మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాజీ, లడ్కీ, బహెన్ యోజన’ కింద, 18– -59 సం.ల మధ్య వయస్కులైన ప్రతి మహిళా కుటుంబానికి నెలకు రూ.1500 చొప్పున, అయిదు నెలల పాటు (రూ.7500) అందజేశారు. ఇటువంటివే అంతకుముందు మధ్యప్రదేశ్, హర్యానాలో బీజేపీ నేతృత్వపు ప్రభుత్వాలు ప్రకటించి, అమలు చేస్తూ లబ్ధి పొందాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ నేత మమతా బెనర్జీ, ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహిళలనుద్దేశించిన వేర్వేరు పథకాలు కన్యశ్రీ ప్రకల్ప (2013), రూపశ్రీప్రకల్ప (2018), లక్ష్మీర్ బండార్ (2021) వంటివి ప్రకటించి, అమలుపరచి ఆ మేరకు లబ్ధి పొందారు. కర్నాటక, తెలంగాణలో విపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రయోజన (నగదు బదిలీ) హామీలు ఇచ్చి, రాజకీయ లబ్ధితో అధికారంలోకి వచ్చింది. వీటి ప్రభావంతోనే..ఢిల్లీలో రేపు ఫిబ్రవరిలో ఎన్నికల్ని ఎదుర్కోబోతున్న పాలకపక్షం ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) అక్కడ మహిళా ప్రయోజనకర (నగదు బదిలీ) పథకాన్ని తాజాగా ప్రకటించింది. తాము మళ్లీ గెలిస్తే, నెలకు వెయ్యి రూపాయలని రూ.2100 చేస్తామనీ ఆప్ ముఖ్యమంత్రి చెప్పారు.
మహిళా పథకాల ప్రభావం!
1970, 80లలో మహిళల రక్షణ, శాంతిభద్రతలు, లైంగిక వేధింపులు, -హత్యలు, -అత్యాచారాలకు వ్యతిరేకంగా నిర్దిష్ట హామీలు, చర్యలతో వారిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిం
చేవి. 1980ల తర్వాత భద్రతతోపాటు వారికి విద్య, వైద్య సదుపాయాల్ని మెరుగుపరచడంపై దృష్టి పడింది.1982లో ఎంజీ రామచంద్రన్ (తమిళనాడు), మధ్యాహ్నభోజన పథకం, 1994లో ఎన్టీఆర్ (ఆంధ్రప్రదేశ్) మద్యనిషేధం వంటివి అలా తెచ్చినవే! పిల్లలకు,1920ల నుంచే పలు అనియత పద్ధతుల్లో విద్య, వైద్య, పౌష్టికాహార.. సహాయం అందుతున్నా.. 2004 – -2024 మధ్య కాలంలో పిల్లలను ఉద్దేశించి, ముఖ్యంగా బాలికల్ని పరిగణనలోకి తీసుకొని పలు పథకాల్ని రూపొందించారు. జేడీ(యూ) పార్టీబిహార్లో, బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో బాలిక, మహిళా కేంద్రక కార్యక్రమాలు ప్రత్యేకంగా రూపొందించాయి. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి బాలికా సైకిల్ యోజన’ పిల్లలు అర్ధంతరంగా బడిమానివేయడాన్ని రమారమి తగ్గించింది. అదే నితీశ్‌కుమార్ 2018లో ఇంకో అడుగు ముందుకేసి.. ఇంటర్ పూర్తి చేసిన బాలికలకు వెయ్యి రూపాయలు, డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలకు యాభైవేల రూపాయలు, ఏటా సానిటరీ నాప్కిన్స్ కోసం యువతులకు రెండువేల రూపాయలు ఇచ్చే పథకం ప్రారంభించారు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాల్లో మహిళా కేంద్రకంగా వివిధ పథకాలు, కార్యక్రమాలు అమల్లోకొచ్చాయి.
నాలుగు కులాల్లో మహిళలు ఒకటన్న మోదీ
మోదీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చిన నుంచి బీజేపీ జాతీయస్థాయిలోనూ పలు నగదు బదిలీ పథకాల్ని, ముఖ్యంగా 2019 నుంచి చేపట్టింది. ప్రధానమంత్రి జనధన్ యోజన (2014), ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన (2016), ప్రధానమంత్రి మాతృవందన్ యోజన (2017) వంటివి మహిళల్ని సాధికారతవైపు నడిపేలా రూపొందించినవే! బేటీ బచావ్ - బేటీ పడావ్ కూడా అలాంటిదే! తన దృష్టిలో, దేశంలోని నాలుగు కులాల్లో మహిళలు ఒకటని ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లోని ఓ మహిళా సభలో మాట్లాడుతూ లోగడ అన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళల్ని నాలుగు కులాలుగా పరిగణిస్తానని ఆయన తన ప్రాధాన్యతల్ని వివరించారు
ఎందుకో ఏపీ భిన్నం!
ఆరు మాసాల కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఆ రాష్ట్రంలో మహిళా కేంద్రక నిర్దిష్ట కార్యక్రమాలున్నా.. పాలక వైఎస్సార్సీపీకి ఓటమి తప్పలేదు. అయిదేండ్లలో (2019–24) 18 పథకాల కింద, 4.58 కోట్ల మహిళా లబ్ధిదారులకు రూ.1.89 లక్షల కోట్ల మేర నగదు బదిలీతో లబ్ధి చేకూర్చారు. నగదు రూపంలో కాకుండా 1.26 కోట్ల మంది మహిళలకి రూ. 94 వేల కోట్ల లబ్ధి చేకూర్చారు. అయినా.. వైఎస్సార్సీపీ 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 11 స్థానాలకు పడిపోయింది. ఈ విరుద్ధ ఫలితమే సందేహాలకు తావిస్తోంది. దేశంలోని మహిళలు తాము పొందిన లబ్ధి కోణంలో కాకుండా కుటుంబం, కులం, గ్రామం తదితర అంశాల ప్రాతిపదికనే ఓట్లు వేస్తున్నారేమో అనే సందేహాలున్నాయి. ఇదంతా మరింత శాస్త్రీయంగా ధృవపడితే తప్ప ఖచ్చితమైన కారణం ఇదీ అని స్పష్టంగా చెప్పలేం!
పెరుగుతున్న మహిళా ఓటింగ్
జనాభాలో మహిళ నిష్పత్తి, ఓటింగ్‌లో పాల్గొనడం గణనీయంగా పెరుగుతోంది. 1957 (రెండో సార్వత్రిక) ఎన్నికల్లో, మొత్తం మహిళా ఓటర్లలో 39% ఓటింగ్‌లో పాల్గొంటే పురుషులు 56% పాల్గొన్నారు. 1962 నుంచి పురుషుల్లో సగటున 60% పైనే ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మహిళలు 1998 ఎన్నికల దాకా 60 శాతానికి ఎప్పుడూ చేరలేదు. ఇందిరాగాంధీ హత్యకు గురైన 1984 ఎన్నికలు మినహాయిస్తే, మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిన దాదాపు ప్రతి ఎన్నికలోనూ (1977, 1998, 2014) ఉన్న ప్రభుత్వాలు ఓటమిపాలయ్యాయి. 2024 ఎన్నికలు వచ్చేసరికి, ఓటింగ్‌లో పాల్గొంటున్న మహిళా, -పురుష ఓటర్ల మధ్య వ్యత్యాసం 1% కు పరిమితమైంది. ఓటర్లణను జనాభాపరంగా చూసినపుడు దేశంలోని మొత్తం (36) రాష్ట్రాలు ప్లస్ -కేంద్రపాలిత ప్రాంతాలలోని 19 చోట్ల మహిళల ఆధిక్యత ఉంది. మహిళా కేంద్రక సంక్షేమ కార్యక్రమాలు, నగదు బదిలీ వంటివి చేపట్టినపుడు వారి మొగ్గు స్వల్పంగానైనా ఆయా ప్రభుత్వాలు, పక్షాలకు అనుకూలంగా ఉన్నట్టు ‘జాతీయ ఎన్నికల అధ్యయనాలు’ ఎన్ఈఎస్ చెబుతున్నాయి. ‘అభివృద్ది సమాజాల అధ్యయన సంస్థ’ (సీఎస్డీఎస్) మాత్రమే చేసే ఇటువంటి సర్వే గణాంకాలు, ఆయా పార్టీలు మహిళా కేంద్రక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.
- దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
డైరెక్టర్, - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ