సంక్రాంతి పండగ వచ్చిందంటేచాలు ఉభయ గోదావరి జిల్లాల్లో సందడి ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు, భీమవరంలో తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా కేసినోలని నిర్వహించారు. సంక్రాంతి సంబరాల ముసుగులో భారీ స్థాయిలో జూదం, కోడి పందేలు, గుండాటలు వంటివి నిర్వహిస్తూ ప్రజల జేబులకు చిల్లు పెట్టారు.
అంతటితో ఆగకుండా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార అండతో అసోం, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాల యువతీ, యువకులను తీసుకువచ్చి కేసినోలను నిర్వహించారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో భారీగా టెంట్లు వేసి మరీ కెసినో నిర్వహించారు. మరికొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్స్ పేరుతో అశ్లీల నృత్యాలు కూడా జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ భీమవరం, పాలకోడేరు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ALSO READ | జోరుగా కోడి పందేలు.. గెలిచినోళ్లకు రూ. 20 లక్షల థార్ కారు బహుమతి
ఉద్యోగాలు, వ్యాపారాలు, అంటూ ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినవారు సంవత్సరం పొడవునా సంపాందించిందంతా సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహిస్తున్న ఆటలతో పోగొట్టుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. అలాగే ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వ అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.