
పారిస్: ఒలింపిక్స్‌లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్ ఫొగాట్ వేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) అడ్‌హక్ డివిజన్ కొట్టేసింది. కనీసం రజత పతకమైనా ఇవ్వాలన్న రెజ్లర్ అభ్యర్థనను కాస్ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దీంతో వినేశ్ పతకం లేకుండానే పారిస్ గేమ్స్‌ను ముగించినట్లయింది. వాస్తవానికి ఈ పిటిషన్‌పై తుది తీర్పు శుక్రవారం రావాల్సి ఉన్నా ఓ రోజు ముందే బహిర్గతం కావడంతో చర్చనీయాంశంగా మారింది.
కాస్ తీర్పు నిరాశను కలిగించిందని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష వ్యాఖ్యానించింది. ‘కాస్ ఇలాంటి నిర్ణయం వెలువరిస్తుందని అనుకోలేదు. ఇది దిగ్భ్రాంతిని కలిగించింది. క్రీడా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాదనలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నా తీర్పు ప్రతికూలంగా రావడం ఇబ్బందికరం’ అని ఉష పేర్కొంది. ఈ తీర్పుపై మరోసారి అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.