హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్ సినీ పెద్దల నడుమ ఇన్నాళ్లూ అంతర్గతంగా నడుస్తున్న కుమ్ములాటలు ఇప్పుడు బజారునపడ్డాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేదికగా ఇవి బట్టబయలయ్యాయి. ఎవరి కుల పెత్తనాలు, ఎవరి పొలిటికల్ ఎజెండాలు ఏమిటో తేటతెల్లమయ్యాయి. అసోసియేషన్‌లోని పరిణామాలు చూస్తుంటే చీలిక ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెరపైకి ఎన్నికలు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు నడుమే సాగినా.. తెర వెనుక మాత్రం చిరంజీవి, మోహన్‌బాబు మధ్య నడిచాయని సినీ వర్గాలు అంటున్నాయి. కులం, ప్రాంతం, ఇగోస్, పాలిటిక్స్ లాంటి ఎన్నెన్నో ఈ ఎన్నికల వెనుక దాగున్నాయని చెప్తున్నాయి.
ఎవరి వైపు ఎవరు?
925 మంది మెంబర్లున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ఎన్నికలకు రెండు నెలల ముందే ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మొదట అంతా ఓకే అనుకున్నా.. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి అసలు పంచాయితీ తెరపైకి వచ్చింది. ప్రకాశ్‌రాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఓ వర్గం భావించినప్పటికీ తాను బరిలోకి దిగుతున్నట్లు మంచు విష్ణు ప్రకటించడంతో సీన్ మారిపోయింది. ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి వర్గం సపోర్టు చేస్తోందని వార్తలు వచ్చాయి. మంచు విష్ణును మోహన్‌బాబు దగ్గరుండి బరిలోకి దింపినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఇదే నిజమైంది. పోలింగ్ రోజు వరకు ఇరు వర్గాలు ‘నువ్వా నేనా..’ అన్నట్లుగా కాలుదువ్వాయి. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూలతోపాటు రాజకీయ ఎజెండాలు రచ్చ చేశాయి. మొత్తం మెంబర్లలో ఓటు హక్కు 883 మందికే ఉంది. అందులో ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయిలో 655 ఓట్లు పోలయ్యాయి. ఇరు వర్గాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను రప్పించి ఓట్లు వేయించాయి. చివరికి ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు ప్రెసిడెంట్‌గా విజయంసాధించారు. విష్ణుకు 381 ఓట్లు.. ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. ప్రకాశ్‌రాజ్‌కు వచ్చిన ఓట్లు చూస్తే ‘మా’లో దాదాపు సగభాగం ఆయనను సపోర్ట్ చేసినట్టే తెలుస్తోంది. వీరిలో చిరంజీవి ఫ్యామిలీ హీరోలతో పాటు, ఆయనతో కలిసి నడిచే నటీనటులు కూడా ఉన్నారు. వారంతా విష్ణుకు సపోర్టు చేసే అవకాశం లేదు.
దాసరి బెర్త్ కోసం..!
ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ పరిష్కరించేవారు దాసరి నారాయణరావు. ఆయన మరణం తర్వాత ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేకపోయారు. ఆ స్థానంలోకి చిరంజీవి రావొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీలోని సినీ పేదలను ఆదుకునేందుకు చిరంజీవి చొరవతోనే కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పడింది. ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలపై చిరంజీవి నాయకత్వంలోనే సినీపెద్దలంతా కలిసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. గత కొన్నేండ్ల నుంచి చిరంజీవి సపోర్టు చేస్తున్న వ్యక్తులే ‘మా’కు ఎన్నిక అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నాయకత్వానికి చెక్ పెట్టేందుకు ‘మా’ ఎన్నికలపై మోహన్ బాబు ఫోకస్ పెట్టినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. తన కుమారుడు విష్ణును గెలిపించడం ద్వారా తన లీడర్ షిప్ ను ఆయన నిరూపించుకున్నారు. ‘‘సింహం నాలుగు అడుగులు వెనకకు వేసిందంటే తర్వాత విజృంభించడానికే, సముద్రంలోని కెరటాలు వెనక్కి వెళ్లాయి కదా అని అజాగ్రత్తగా ఉంటే సునామీ వచ్చినట్టు ఉధృతి వస్తుంది’’ అంటూ విష్ణు గెలుపు తర్వాత మోహన్‌బాబు చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తనను రెచ్చగొట్టేందుకు చాలామంది ప్రయత్నించినా మౌనంగా ఉన్నది, సరైన సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికేనని, తానేమీ అసమర్ధుడిని కానని ఆయన అన్నారు. ఈ కామెంట్లకు తోడు ‘మా’ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అసోసియేషన్ సభ్యత్వానికి చిరంజీవి తమ్ముడు నాగబాబు రాజీనామా చేయడం.. తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా రాజీనామా చేయడం చూస్తుంటే ‘మా’లో ముందు ముందు ఎన్నో పరిణామాలు జరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా.. ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేసిన అనంతరం ‘‘దీంతో అయిపోయిందనుకున్నారా..! ఇప్పుడే మొదలైంది’’ అని కామెంట్ చేశారు. తామంతా ఒక్కటేనని ‘మా’ సభ్యులు జనం ముందు చెప్తున్నప్పటికీ పరిణామాలు చూస్తుంటే అసోసియేషన్‌లో చీలిక తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి గెలిచిన శ్రీకాంత్ కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో మరో అసోసియేషన్ ఏర్పడటం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అటు వాళ్లు..ఇటు వీళ్లు..
ఒకప్పుడు కమ్మ కులస్తుల డామినేషన్‌లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ, చిరంజీవి ఎంట్రీతో కొత్త మలుపు తిరిగిందనేది కొత్త విషయమేమీ కాదు. ఈసారి ‘మా’ ఎన్నికల్లో కులాల ఫీలింగ్‌తో ఓటింగ్ జరిగిందని సినీ వర్గాలు అంటున్నాయి. మోహన్ బాబు చాటున కమ్మ కులస్తులు ఈ ఎన్నికల్లో చురుకుగా పనిచేశారు. చిరంజీవితో పాటు కాపు కులస్తులు ప్రకాశ్ రాజ్‌ను సపోర్ట్ చేశారు. విష్ణు ప్యానల్‌కు రెడ్లు కూడా తమవంతు సహాయం చేశారని తెలుస్తున్నది. ఏపీలో వైసీపీని వ్యతిరేకిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టేందుకు జగన్ ఈ ఎన్నికలను వాడుకున్నారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ను అడ్డుకోవడంలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు సపోర్ట్ లేకుండా చేయడానికి జగన్ ఇలా ప్రయత్నించారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, ప్రభుత్వమే ఆన్ లైన్ టికెట్స్ అమ్మనుండటం లాంటివి ఇందులో ఒక భాగమేనంటున్నాయి. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కూడా ఎన్నికల్లో బాగా పనిచేసింది అనేది అందరికీ తెలిసిందే. తన ప్రచారంలో ప్రకాశ్ రాజ్‌ని నాన్ లోకల్‌గా చూపించడంపై విష్ణు ఎక్కువ ఫోకస్ చేశారు.