త్వరలో కులగణన వివరాలు బయటపెడ్తం.. సామాజిక న్యాయానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి

త్వరలో కులగణన వివరాలు బయటపెడ్తం.. సామాజిక న్యాయానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
  • సర్వేలో పాల్గొనని వాళ్లు వివరాలు ఇస్తే అప్​డేట్​ చేస్తం
  • విధానపరమైన నిర్ణయాలకు డేటా వాడుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే కులగణన సర్వేకు సంబంధించిన అంశాలను డిటైల్డ్ గా ప్రజెంటేషన్ చేసి ప్రజల ముందు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

బుధవారం సెక్రటేరియెట్​లో సీఎస్​శాంతి కుమారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన సర్వే జరగొద్దని కొందరు తప్పుడు ప్రచారం చేసి సర్వేలో పాల్గొనొద్దని పిలుపు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను అర్థం చేసుకొని సర్వే విజయవంతం కావడానికి ప్రజలు సహకరించి వారి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారన్నారు. 

ఇప్పుడు కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా కొన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్న కుల గణన సర్వే పూర్తి చేసి చట్టసభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కులగణన చాలా పారదర్శకంగా, శాస్త్రీయంగా జరిగిందని వివరించారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సర్వే రాష్ట్రంలోని ప్రజల వివిధ రకాల స్థితిగతులపై ఫుల్ బాడీ చెకప్, ఒక ఎక్స్​రే లాంటిదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుందన్నారు. 

సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు ఆసక్తి కనబరిచి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కులగణన సర్వే దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియగా ఉపయోగపడుతుందన్నారు. సర్వే సక్సెస్ కావడానికి సహకరించిన ప్రజలకు, శాస్త్రీయంగా సర్వే చేసిన అధికారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.