
- రాష్ట్ర జనాభాను తగ్గించి చూపారు
- మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడక అని, రీసర్వే చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ముందుగా ప్రజలంతా తమ పేర్లు ఉన్నాయో? లేవో? తెలుసుకునేందుకు కుల గణన ముసాయిదాను బయటపెట్టాలని కోరారు.
కరీంనగర్ లోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ2011 లెక్కల ప్రకారమే తెలంగాణలో 3.05 కోట్ల జనాభా ఉంటే.. ఇప్పుటి లెక్కల్లో 3.70 కోట్లుగా చూపించారని గుర్తు చేశారు. కేంద్ర సెన్సెస్ అంచనా ప్రకారం.. పదేండ్లలో తెలంగాణలో జనాభా 4.25 కోట్లకు చేరుతుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.35 కోట్ల ఓటర్లుండగా, 18 ఏండ్ల లోపు వాళ్లు కాలేజీ, స్కూల్ లెక్కల ప్రకారం 60 లక్షల మంది ఉన్నారని, ఈ లెక్క ప్రకారమైనా 3.95 కోట్ల జనాభా ఉండాలని పేర్కొన్నారు. ముస్లిం బీసీలు కాకుండా, మిగతా బీసీల జనాభా దాదాపు 52 నుంచి 54 శాతం ఉంటుందని, కానీ 46 శాతమే చూపించి బీసీలను అవమానించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ లో కీలక పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదన్న మీడియా ప్రశ్నలకు.. వీపీ సింగ్ బీసీ కాకున్నా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారని, ఎన్టీఆర్ బీసీలకు టికెట్లు ఇచ్చారని, అదే విధంగా కేసీఆర్ బీసీ కుల వృత్తులకు న్యాయం చేశారన్నారు.
బీసీ మంత్రి కేంద్రంలో ఉండాలని డిమాండ్ చేసిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా సీఎం కాలేదని.. పార్టీలకతీతంగా ఈ డిమాండ్ భవిష్యత్తులో నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన శాస్త్రీయంగా చేయకుండా అసెంబ్లీని మోసం చేశారని, మరోసారి సర్వే చేసి.. సర్వే రిపోర్ట్ గ్రామాలు, పట్టణాల్లో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ జాతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.