- గైడ్లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి
- జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి
- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి: బీసీ మేధావులు
- 6 శాతం ఉన్న ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ప్రభుత్వ ఫలాలు బీసీలకు అందాలే: వకుళాభరణం కృష్ణమోహన్ రావు
- బీసీ సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలు రాహుల్కు ఇస్త: అనిల్ జైహింద్
- తెలంగాణ బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. బీసీ మేధావుల సదస్సు సెమినార్లో 12 తీర్మానాలు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చేయాల్సిందేనని బీసీ మేధావులు, ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచిన తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన చేపట్టేందుకు వెంటనే గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలన్నారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘కుల గణన’ అంశంపై మేధావులతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, హైకోర్టు రిటైర్జ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కన్వీనర్ అనీల్ జైహింద్, టీబీసీఈఎఫ్ గౌరవ అధ్యక్షుడు దేవల్ల సమ్మయ్య, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, వరంగల్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఏడు గంటల పాటు సాగిన సెమినార్లో 12 తీర్మానాలను ఆమోదించారు.
వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి సీఎం బీసీనే: తీన్మార్ మల్లన్న
రాష్ట్రంలో 75 ఏండ్ల నుంచి బీసీలు వెనకబడి ఉన్నారని, వెంటనే కులగణన చేపట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి కాబోయే సీఎం బీసీ వర్గాల నుంచే ఉంటారని స్పష్టం చేశారు. కేవలం ఆరు శాతం జనాభా ఉన్న ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఉంటే 60 శాతం ఉన్న బీసీలకు 30 శాతం కూడా లేవన్నారు. బీసీలకు 250 మార్కులు వచ్చినా ఉద్యోగం రావడంలేదని, 200 మార్కులు వచ్చినా ఓసీలకు జాబ్ లు వస్తున్నాయని గుర్తు చేశారు. అగ్రకుల అధికారులు బీసీ అధికారులపై ఏసీబీ దాడులు చేయిస్తున్నారని ఇది చాలా బాధకరమన్నారు. కులగణనపై కేబినెట్ తీర్మానం చేసి, రూ.150 కోట్లకు జీవో ఇచ్చి గైడ్ లైన్స్ మాత్రం ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు బీసీ ఉద్యమం అని అంటున్నారు. అధికారంలో ఉన్న గత పదేండ్లు ఆయన బీసీలను తీవ్రనిర్లక్ష్యం చేశారని అన్నారు.
రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్త: అనీల్ జైహింద్, కన్వీనర్, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్
తెలంగాణ పబ్లిక్ అంటే ఫైటర్స్ అనే పేరుందని అనీల్ జైహింద్ అన్నారు. గతంలో నిజాం మీద పోరాడారని, ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల టైమ్ లో పార్టీలో వ్యతిరేకత వస్తుందని నేతలు హెచ్చరించినా.. కులగణన, సోషల్ జస్టిస్ గురించి రాహుల్ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. బీసీ సంఘాలు కులగణనపై ఇచ్చిన వినతిపత్రాలను రాహుల్ గాంధీకి అందజేస్తానని, కులగణన ప్రాముఖ్యతను ఆయనకు వివరిస్తానని చెప్పారు.
కులగణనకు ఎన్డీఏ అడ్డుపడుతున్నది: వకుళాభరణం కృష్ణమోహన్ రావు
కులగణన చాలా ముఖ్యమైన అంశమని, బీసీల్లో రిజర్వేషన్లు లేని కులాలు చాలా ఉన్నాయని, వారికి ప్రభుత్వ ఫలాలు, నిధులు అందాలన్నదే కులగణన ముఖ్య ఉద్దేశమని వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఆరు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో యూపీఏ హయాంలో సామాజిక కులగణన జరిగిందని, దేశంలో 52 శాతం బీసీలు ఉన్నట్లు లెక్క తేలిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలు బయట పెట్టకుండా అందులో తప్పులు ఉన్నాయని, వాటి సవరణకు నీతిఅయోగ్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి వారికి విధులు, నిధులు అప్పగించలేదన్నారు. కులగణన చేస్తామని 2021లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారని, కానీ ఇంత వరకు ఆ ఊసే లేదన్నారు.
కులగణన రాష్ట్రం నుంచే స్టార్ట్ చేయాలే: ప్రొఫెసర్ మురళీమోహన్, కేయూ
కులగణనపై పార్లమెంటు ఎన్నికల టైమ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం అభినందనీయమని ప్రొఫెసర్ మురళీ మోహన్ అన్నారు. రాహుల్ ప్రకటన అమలును కాంగ్రెస్అధికారంలో ఉన్న తెలంగాణ నుంచే స్టార్ట్ చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. 20 ఏండ్ల నుంచి బీసీ సమస్యలపై పోరాడుతున్నానని, గతంలో బీసీ సబ్ ప్లాన్ గురించి పోరాడితే ఇపుడు కులగణన గురించి పోరాడుతున్నానని ఆయన పేర్కొన్నారు. కులగణనపై ఎన్డీఏ యూ టర్న్ తీసుకుందని, వాళ్లు చేయకుండా.. కేసులు వేయిస్తూ చేస్తామన్న రాష్ట్రాలను సైతం అడ్డుకుంటున్నారని చెప్పారు.
యునిటీ లేకనే బీసీలకు అన్యాయం
కులగణన కోసం ఐక్యంగా అందరూ కలిసి పోరాటం ఉధృతం చేయాలని హైకోర్టు రిటైర్జ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, న్యాయ వ్యవస్థ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల్లో యునిటీ లేకపోవడమే దీనికి కారణమన్నారు. న్యాయ వ్యవస్థలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను స్వయంగా చూశానన్నారు. రాహుల్ గాంధీ సోషల్ జస్టీస్ గురుంచి మాట్లాడటం మంచి పరిణామని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. కులగణనను వెంటనే స్టార్ట్ చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ప్రభుత్వానికి రాహుల్ చెప్పాలన్నారు. అగ్రకులాల వారు సీఎం, మంత్రులు అవుతుంటే బీసీలు లోకల్ బాడీ పదవులు కూడా పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులగణన అనేది ప్రధాన అంశంగా మారిందని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. కులగణనపై రాహుల్ ప్రకటనతో బీజేపీ పునారాలోచనలో పడిందని, ఆర్ఎస్ఎస్ తో కులగణనకు అనుకూలంగా పరోక్ష ప్రకటనలు చేయిస్తున్నదని అన్నారు.