భారతీయ సమాజానికి  కులగణన ఒక ఎక్స్  రే

భారతీయ సమాజానికి  కులగణన ఒక ఎక్స్  రే

బ్రిటిష్ పాలనలో 1881 నుంచి 1931 వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే  జనాభా లెక్కలలో కులాలవారీగా జనాభా గణన చేశారు. నిజాం పాలనలో కూడా కులగణన జరిగింది. కానీ,  స్వాతంత్ర్య భారతంలో 1951 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ,  ఎస్టీలు తప్ప మిగతా కులాల లెక్కలు సేకరించడం లేదు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1951 సెన్సస్​లో  కులగణనకు సమ్మతించలేదు.  కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలు గతంలో కులగణనకు ఒప్పుకుని యూటర్న్ తీసుకుని ఓబీసీలకు అన్యాయం చేశాయి.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి  వచ్చిన ఆరు నెలలలోపే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే కులగణనపై  కేబినెట్ తీర్మానం, అలాగే అసెంబ్లీ తీర్మానం చేసింది.  జీ.ఓ.26 తేది 15-–3–-2024 ఇచ్చి రూ.150 కోట్లు కేటాయించింది. అయితే, నేడు కులగణన లేకుండా, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరి దీనిని ఏమంటారో  మీరే ఆలోచించండి.  అట్టడుగు వర్గాల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని బట్టబయలు చేసే ఒక ఎక్స్ రే కులగణన.

కులగణన ఎందుకు చేయాలి?

కులగణన ఒక సామాజిక అవసరం: - భారతీయ సమాజంలో కులం అనేది ఒక వాస్తవికత . కులం, కుల వ్యవస్థ, కుల వృత్తులు, కుల సంస్కృతి అనేవి భారతీయ జీవన విధానంలో వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి. నిత్యజీవితంలో పెండ్లి, పండుగలు, వృత్తులు, వ్యాపారం, రాజకీయాలు కులంతో ముడిపడి ఉన్నవే. ఈ కులాలు వర్ణ వ్యవస్థ చట్రంలో ఉన్నత, నిమ్న భావాలతో అమర్చినవే.  విద్యకు నోచుకోలేక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన ఈ వర్గాలకు  భారత రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాలను అందుకోవాలంటే ప్రత్యేక రక్షణలు అవసరం. 

రాజ్యాంగపరమైన న్యాయ అవసరం: - రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే సమగ్ర  కులగణన అవసరం. రాజ్యాంగపరమైన విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పొందాలంటే కులగణన అవసరం.  నిజానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 (4)లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులను పేర్కొనటం జరిగింది. 

వెనుకబడిన తరగతులను గుర్తించాలి అంటే కులమే ప్రధాన ప్రామాణికమని సుప్రీంకోర్టు,  కాకా కాలేల్కర్, మండల్ కమిషన్లు నొక్కి చెప్పడం జరిగింది. ఓబీసీ కులాల లెక్కలు లేకపోవడం వలన అనేక సార్లు బీసీలకు  సంబంధించిన కేసులు ఓడిపోవడం జరిగింది.  భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 ఏ(3) ప్రకారం రాష్ట్రాలు వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయవలసి ఉంది.  ఆ జాబితాను విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోసం వినియోగించుకోవచ్చును. కేంద్రం కూడా తమ సొంత ఓబీసీ కులాల జాబితాను ఆర్టికల్ 342 ఏ(1) ప్రకారం  రాష్ట్రాలవారీగా తయారు చేసుకోవచ్చును. 

పరిపాలనాపరమైన అవసరం:- కులాలవారీగా  జనాభా లెక్కలు ఉన్నప్పుడే అర్హులైనవారికి ప్రభుత్వ పథకాలు అందించే వీలు ఏర్పడుతుంది. వారి అభివృద్ధికి తగు ప్రణాళికలు రచించవచ్చును. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. బీసీ కులాలను ఉప కులాలుగా విభజించటం వీలు అవుతుంది.  క్రిమిలేయర్ ను కూడా సమర్థవంతంగా అమలుచేసే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 1948 జనాభా లెక్కల చట్టంలో ఓబీసీ కులాల జాబితాను చేర్చి  ఎస్సీ,  ఎస్టీ కులాలవారీ లాగానే ఓబీసీల జనాభా లెక్కలు సేకరించవచ్చును.  అలాగే రాష్ట్రాలు కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2008 చట్ట ప్రకారం కులగణన చేపట్టవచ్చును.  బిహార్ హైకోర్టు రాష్ట్రాలకు కులగణన చేసే అధికారం ఉంది అని తీర్పు ఇవ్వడం జరిగింది.సబ్బండ వర్ణాల అభివృద్ధికి అవసరం: - వెనుకబడిన వర్గాల లెక్కలే కాకుండా అభివృద్ధి చెందినవారి లెక్కలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన (అగ్రవర్ణాల) 10 శాతం రిజర్వేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయవచ్చును.

కులగణనతో ఓబీసీలకు సామాజిక న్యాయం

కుల జనగణన వలన మాత్రమే ఓబీసీ కులాలకు సమానత్వం, సామాజిక న్యాయం అందుతాయి. వారి సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం తేటతెల్లం అవుతుంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచవచ్చు. కులగణన ఈ దేశానికి ఒక దశ, దిశను  నిర్దేశిస్తుంది. దేశ ప్రగతికి దిక్సూచిగా మారుతుంది.  ఓబీసీలను  సబ్ కేటగిరీలుగా చేసి విద్య,  ఉద్యోగ,  స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి ఫలాలు అందించే వీలు ఏర్పడుతుంది. సమగ్ర కులగణననే భారతీయ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని 
కులగణన చేయాలి. లేనిచో రాబోయే ఎన్నికలలో బీసీ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

కులగణనను కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే?

కులగణన వలన దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలుగుతుంది, ప్రజల మధ్య వైషమ్యాలు ఏర్పడతాయని,  ప్రజలు విభజింపబడతారని కొందరి వాదన. అయితే, నిజానికి భారతీయ సమాజం మూడు వేల సంవత్సరాల క్రితమే కులాలవారీగా  ప్రజలను విభజించింది. ఇందులో కొత్తగా విభజించేది ఏమీ లేదు. అదేవిధంగా దేశంలో జనాభా లెక్కలు సేకరించేటప్పుడు మతం, ప్రాంతం, భాష విషయాలు సేకరిస్తాం. మతం, భాష, ప్రాంతం విషయాల సేకరణ వలన దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలగదా?  కేవలం ఓబీసీ  కులగణన వల్లనే వైషమ్యాలు పెరుగుతాయని, దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పడం విడ్డూరం.  అలాగే జనాభా లెక్కలలో 1234 ఎస్సీ కులాలు, 698 ఎస్టీ కులాల లెక్కలు తీస్తున్నాం. మరి కేవలం ఓబీసీ కులాల లెక్కలు తీయడం వలన మాత్రమే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందనేది ఏమేరకు వాస్తవం అనేది గుర్తించాలి.

కులగణన వల్ల రిజర్వేషన్లు పెంపు వాస్తవం కాదు

కులగణన వలన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ పెరుగుతుంది. ఇది కూడా వాస్తవం కాదు. కులాలవారీగా జనాభా లెక్కల వలన అత్యంత వెనుకబడినవారిని సులభంగా గుర్తించవచ్చును. వారికి రిజర్వేషన్లు సమర్థవంతంగా అందించవచ్చును. అభివృద్ధి చెందిన వర్గాల రిజర్వేషన్ల డిమాండ్ సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చును. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు కోసం కొన్ని అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడాన్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చును. బీసీ కులగణన సంక్లిష్టమైనదని సుప్రీంకోర్టులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్​లో పేర్కొంది. ఇది పూర్తిగా వాస్తవానికి విరుద్ధం. ఓబీసీలు తమ కులం చెప్పుకోలేనంత వెనుకబడిలేరు.1,234 ఎస్సీ కులాలు, 698 ఎస్టీ కులాల జనాభా లెక్కలు తీయగలిగినప్పుడు 2,633 ఓబీసీ కులాలు సుమారు 4,000 రాష్ట్ర బీసీ కులాల జనాభా లెక్కలకు ఇబ్బంది కాదు. ఎలాంటి సాంకేతిక, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేనప్పుడు, ప్రజలు నిరక్షరాస్యులుగా బానిస బతుకులు బతుకుతున్నప్పుడు, బ్రిటిష్ వారు కులగణన చేసినప్పుడు, ఈ ఆధునిక యుగంలో కులగణన చేయలేమని చెప్పడం హాస్యాస్పదం.

  

టి.చిరంజీవులు,
ఐఏఎస్ (రిటైర్డ్)