- తప్పుడు సమాచారం నమోదు చేస్తే చర్యలు తప్పవు
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి స్టార్ట్ కానున్న కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. ప్రజలు కరెక్ట్ సమాచారం ఇవ్వాలని, ఎన్యుమరేటర్లు కూడా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజలు తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఎక్కడైనా, ఎవరైనా అధికారులుగానీ.. ఎన్యుమరేటర్లు గానీ తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కమిషన్ నిష్పక్షపాతంగా, కచ్చితంగ, కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా మంచి వాతావరణంలో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి కుల గణనకు సహకరించాలని పిలుపునిచ్చారు.
18నుంచి బీసీ కమిషన్ జిల్లా పర్యటనలు
బీసీ కమిషన్ ఈ నెల 18 నుంచి ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నది. ఈ అంశంపై శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 న నల్గొండ, 19 న ఖమ్మం, 21 న రంగారెడ్డి, 22న మహబూబ్ నగర్, 23న హైదరాబాద్ లో బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్స్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ కు అటెండ్ కాని వాళ్లు 25,26న హైదరాబాద్ లో బీసీ కమిషన్ ఆఫీస్ కు వచ్చి బీసీ రిజర్వేషన్ల పెంపు పై తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని కమిషన్ సూచించింది. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ లో బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది.