తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర కులసర్వేపై సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జస్టిస్ చంద్రకుమార్, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమగ్ర కులసర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈ కులసర్వే సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించడానికి, పీడిత, సామాజిక వర్గాలకు సంపదను అందించడానికి, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడానికి ఉపకరిస్తుందని తెలిపారు.
బీసీ సబ్ ప్లాన్‌తో బడ్జెట్‌ను కేటాయించడం జరుగుతుందని, ఇది ఒక సామాజిక పరివర్తన వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుందన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కులాల సర్వేకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఇంటిని సర్వే చేసి కాస్ట్ సెన్సెస్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్లు పీపుల్స్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులుకు, ముఖ్యమంత్రికి, ప్రభుత్వ అధికారులకు సమగ్ర కులసర్వే నిర్వహించాలని రిప్రెజెంటేషన్లను ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడుతూ ‘తెలంగాణ మంత్రివర్గం సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే (కులగణన)చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రతి ఇంట కులసర్వే జరపడం రాష్ట్ర ప్రజలు ఆహ్వానించాలి. సమగ్ర కులసర్వే నిర్వహించడం విప్లవాత్మకమైన చర్యగా చూడాలి.
75 ఏండ్లుగా కులగణన డిమాండ్
కులాల జనగణన (కాస్ట్ సెన్సెస్) డిమాండ్ ఈనాటిది కాదు. దాదాపు స్వాతంత్ర్యం అనంతరం నుంచి వివిధ ప్రోగ్రెసివ్ భావజాలంగల సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, మేధావులు గత 75 సంవత్సరాలుగా చర్చిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ భారతజాతిని చైతన్యపరుస్తున్నారు. 1950వ దశకంలో మొదటి రాజ్యాంగ కమిషన్ వెనుకబడిన తరగతుల స్థితిగతులను మెరుగుపరుచుటకు కాస్ట్ సెన్సెస్ అతి త్వరలో చేపట్టాలని సిఫారసు చేసింది.
అదేవిధంగా రెండో రాజ్యాంగ వెనుకబడిన తరగతుల కమిషన్ (మండల్ కమిషన్) కూడా సమగ్ర కులసర్వే జరపాలని 1980లో రికమండ్ చేసింది. 1980 దశకం నుంచి కులాల జనగణన చర్చ తీవ్రంగా ముందుకువచ్చింది. 1997లో జనతా ప్రభుత్వం నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కులగణనను చేయాలని తీర్మానించారు. కానీ వాజ్‌పేయి, -అద్వానీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రం జరిపిన 2001 కులసర్వేలు తిరస్కరించారు. అదేవిధంగా 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ ఎకనామిక్ కులసర్వేను నిర్వహించింది. కానీ, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లెక్కలను బయటపెట్టడానికి తిరస్కరించింది.
చట్టపరమైన అడ్డంకులు లేకుండా చర్యలు
ఎన్నో దశాబ్దాలుగా సంస్థలు, సంఘాలు, పార్టీలు నినదిస్తున్న సమగ్ర కులాల సర్వే సామాజిక పరివర్తనకు గణనీయంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. సోషలిస్టులైన లాలు ప్రసాద్ యాదవ్, ములాయం యాదవ్, శరద్ యాదవ్ నినదించిన కులసర్వేలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ బలంగా ముందుకు తీసుకువచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ, -జనతాదళ్ పార్టీల నిర్ణయంలో భాగంగా బిహార్ ప్రభుత్వం సకల కులాల ఇంటింటి సర్వే జరిపి తమ రాష్ట్రం కులాలవారీగా ప్రజల స్థితిగతులను పొందుపరుస్తూ రిపోర్టును ప్రజల ముందు ఉంచింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల ఇంటింటి సర్వేను రాష్ట్రమంతటా నిర్వహించడానికి పూనుకోవడం సామాజిక పరివర్తనకి నాందిగా చూడాలి. కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరమైన స్థితిగతులను తెలుసుకోవడం సామాజిక మార్పు అవుతుందా అనే ప్రశ్న మన ముందు ఉంది. ఇది గొప్ప బిగినింగ్ గా కనిపిస్తున్నా దాని ద్వారా ప్రభుత్వానికి సామాజిక, ఆర్థిక న్యాయంకోసం చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన అడ్డంకులు లేకుండా ముందుకుసాగొచ్చు.
బిహార్‌లో 75 శాతానికి రిజర్వేషన్లు
బిహార్ ప్రభుత్వ కులగణన తర్వాత ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 65శాతానికి పెంచింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తో కలిపి 75శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసింది. బిహార్ ప్రభుత్వం ఒకేరోజు రెండు లక్షల ఎనిమిది వేలకుపైగా ఉపాధ్యాయుల నియామకం చేస్తూ 75శాతం రిజర్వేషన్లు అమలుపరిచింది.
ఏ అవకాశాలు లేని సామాజిక వర్గాల నుంచి వచ్చిన విద్యావంతులు ఉద్యోగరీత్యా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం గొప్ప మార్పుగా పరిగణించాలి. దీనిద్వారా అభివృద్ధికి దూరంగా ఉన్న సామాజికవర్గాల్లో ఒక నమ్మకం కల్పించడం, భాగస్వాములను చేయడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే. ఇలాంటి పలు చర్యలు బిహార్ ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ను ప్రమోట్ చేయడానికి బడ్జెట్ ద్వారా కింది కులాల నుంచి వచ్చినవారికి ప్రోత్సాహం లభించింది. ఇండ్లు లేనివారు భూమి కొనుక్కోవడానికి ప్రభుత్వం పాలసీ ద్వారా ఆర్థిక సాయం అందించింది.
కులగణన సామాజిక స్థితి ఎక్స్ రే
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి నేటికీ కాస్ట్ సెన్సెస్ వ్యతిరేకిస్తున్నది. చివరికి బిహార్ ప్రభుత్వం చేసిన కాస్ట్ సర్వేలను మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. బీఆర్ఎస్, బీజేపీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా గుర్తించాలి. కాస్ట్ సర్వేను వ్యతిరేకించిన ఈ రెండు పార్టీలు గత పది సంవత్సరాలుగా బీసీలను అభివృద్ధికి, అవకాశాలకు దూరం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు బీసీల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప. ముఖ్యంగా గత పది సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా వెనుకకు నెట్టేసింది. వీరి పట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు అప్రమత్తంగా ఉండాలి. బీసీ కుల సర్వే అనే మోసంతో సమగ్ర కులసర్వే అడ్డుకునే పార్టీల రాజకీయాలను బీసీలు తిరస్కరించాలి. కులగణన భారత సామాజిక స్థితిని చూపించే ఒక ఎక్స్ రే లాంటిది. సమగ్ర కుల సర్వే లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు.
కాస్ట్ సెన్సెస్‌తో సామాజిక పరివర్తన
కులాల సర్వేలో వాస్తవ ఆధారిత ప్రాతినిధ్యానికి అవకాశం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా అభివృద్ధికి, ఆత్మగౌరవానికి నోచుకోని ఎన్నో కింది సామాజిక వర్గాలకు, వ్యక్తులకు గుర్తింపు దొరికే అవకాశం బలంగా ఉంది. సామాజిక, సాంస్కృతిక, మానవీయ విలువలకు నిలయమైన ఉత్పత్తి కులశక్తులకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించడంతోపాటు సామాజిక అభివృద్ధి బలంగా ముందుకువచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వాలు పార్టీలు వారిపట్ల తొంగిచూసే స్థితులు ఈరోజు వరకు కనిపించడం లేదు. దురదృష్టవశాత్తు రాజకీయ, వ్యాపార, కులాధిపత్యం కేంద్రంగా రాష్ట్ర,దేశ రాజకీయాలు దేశాన్ని వెనుకబాటుతనానికి గురిచేస్తున్నాయి.
ప్రజాస్వామికవాదులు, ప్రోగ్రెసివ్ శక్తులు ఎందుకు భిన్నంగా ఆలోచించడం లేదు. కులగణన ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయి. ఒక విప్లవాత్మకమైన సామాజిక శక్తి నిర్మాణానికి కులగణన ఉపయోగపడుతున్నప్పుడు ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల విద్యావంతులు దీనిపై ఆలోచించాలి. అన్ని సామాజిక వర్గాల కేంద్రంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకోవాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరతాయి. అమరుల త్యాగాలకు గౌరవం దక్కుతుంది.
ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన, సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు