న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ సంఘాల నేతలు ఏఐసీసీ ఆఫీసును ముట్టడించారు. సమగ్ర కులగణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో వారు ఆందోళనకు దిగారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో కులగణన నిర్వహించాలని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కులగణన ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలకు న్యాయం జరుగుతుందని ప్రస్తావించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చారని వారు గుర్తుచేశారు.
ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ కూడా చెప్పారన్నారు. కానీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. కులగణన ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కులగణన జరిగిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించాలని వారు కోరారు.