
రేవంత్ పట్టుదల వల్లే కులగణన సక్సెస్ అయ్యిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీసీ పోరు గర్జన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి రాహుల్ గాంధీ కల నెరవేర్చామని ఈ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయానికి రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేయించారని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గత10 ఏండ్లు కేసీఆర్ బీసీలను పట్టించుకోలేదని, బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదని విమర్శించారు.
దేశం అంతా తెలంగాణ వైపు చూస్తోందని, ముఖ్యమంత్రి వైపు చూస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు ఎన్నో రాష్ట్రాలు మద్ధతు ఇస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలలో అమలు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందుకోసం అన్ని రాష్ట్రాలలో కులగణన జరపాలని అన్నారు. కేంద్రం కులగణన చేసి, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో దేశం అంతా కదిలితేనే ప్రధాని మోదీ భయపడతారని అన్నారు. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.