బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు కులగణన సర్వే వివరాలు

  • ఆ డేటా ఆధారంగానే రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు
  • సర్వే డేటా భద్రంగా ఉంచాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు  

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికెటెడ్ కమిషన్​కు సమగ్ర ఇంటింటి కులగణన సర్వే వివరాలను ఇవ్వనున్నారు. ఆ వివరాల ఆధారంగానే రిజర్వేషన్ల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 9వ తేదీన మొదలైన కులగణన సర్వే ఈ నెలఖారుకు పూర్తి కానుంది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. సర్వే దాదాపు 50 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా బీసీ డెడికేటెడ్ కమిషన్​కు కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అత్యంత భద్రంగా కులగణన డేటా 

సమగ్ర ఇంటింటి కులగణన సర్వే వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్యుమ రేటర్లు ఇంటింటికి వెళ్లి.. ప్రతి కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు అప్పులు, ఆస్తుల వంటి వివరాలన్నీ నమోదు చేస్తున్నారు.

వీటన్నింటిని కూడా ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక సాఫ్ట్​వేర్​లో ఎంట్రీ చేయనున్నారు. ఎవరికీ పూర్తి స్థాయిలో యాక్సెస్​ లేకుండా ఈ సాఫ్ట్​వేర్​ను రెడీ చేసినట్లు తెలి సింది. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి డేటా వస్తున్నం దున అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. సైబర్ నేరగాళ్లు కూడా అటాక్ చేసి సమాచారాన్ని దొంగిలించే అవ కాశం కూడా ఉంటుందని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది.  రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం పరిస్థితి ఎలా ఉంది? ఏ వర్గం జనాభా ఎంత ఉంది? అన్న వివరాలు సమగ్రంగా తెలిస్తేనే.. అందుకు అనుగుణంగా పాలసీలు రూపొందించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించేందుకు కూడా ఈ డేటా కీలకం అవుతుందని భావిస్తోంది.