ఆర్థిక అసమానతలు తొలగించేందుకే కులగణన

ఆర్థిక అసమానతలు తొలగించేందుకే కులగణన
  • త్యాగాల కుటుంబానికి కులం, మతం అంటగడుతరా ?
  • మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్, వెలుగు : ఆర్థిక అసమానతలు తొలగించాలన్న ఉద్దేశంతో కులగణన చేపడితే గిట్టని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం  తెచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌‌గాంధీకి కులమతాన్ని అంటగడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌‌కి ఇంగితజ్ఞానం ఉందా ? అని ప్రశ్నించారు. 

బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఒక రోజులో చేయించిన సమగ్ర కుటుంబ సర్వేను చట్టబద్ధం చేయలేదన్నారు. ​ 98 వేల మంది ఉద్యోగులతో కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ చేయించిన కులగణనను తప్పుబడుతూ బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు కామెంట్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌‌ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో 20 శాతమున్న ఓసీలు ఇప్పుడు 15 శాతానికి తగ్గారని, 41 శాతమున్న బీసీలు 46 శాతానికి పెరిగారన్నారు. సర్వేను పారదర్శకంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావు కులగణనపై ద్వేషం పెంచుకొని తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటును పక్కన పెట్టిందని, లేకుంటే 20 ఏండ్ల కిందే తెలంగాణ ఏర్పడేదన్నారు. బీజేపీ ప్రయోజనం కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ పోటీ చేయడం లేదన్నారు. ఎమ్యెల్యేలు సుదర్శన్‌‌రెడ్డి, డాక్టర్‌‌ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, వినయ్‌‌రెడ్డి పాల్గొన్నారు.