కులగణనతో అన్ని వర్గాల అభివృద్ధి :  మంత్రి సీతక్క

కులగణనతో అన్ని వర్గాల అభివృద్ధి :  మంత్రి సీతక్క

నేరడిగొండ, వెలుగు: కులగణన అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆదిలాబాద్ ఇన్ చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. నేరడిగొండ మండలంలోని 200 మంది బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అన్నివేళలా కృషి చేస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాంటి పథకాలను చూసి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, పార్లమెంట్ ఇన్​చార్జ్ సత్తు మల్లేశ్, బోథ్ ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బోథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ నారాయణ్ సింగ్, మాజీ సర్పంచ్ రాథోడ్ కమల్ సింగ్, సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.