
మెదక్, రామాయంపేట, వెలుగు: వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ కుల సంఘాల ఓట్లకు గాలం వేస్తోంది. బలమైన సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా కుల సంఘాలకు జాగాలు కేటాయించడం తో పాటు, బిల్డింగ్ ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆయా సంఘ భవనాలకు సైతం భారీగా నిధులు మంజూరు చేసింది.
మెదక్, రామాయంపేట మున్సిపల్ పట్టణాల పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం హామీ మేరకు మంజూరైన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ లో ఎక్కువ శాతం కుల సంఘాలకు కేటాయించారు. మెదక్ పట్టణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లు మంజూరు కాగా వాటిని 104 పనులకు కేటాయించారు. ఇందులో సింహ భాగం వివిధ సంఘాలకే కేటాయించడం గమనార్హం. రామాయంపేట పట్టణానికి మంజూరైన రూ.25 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌లో సైతం కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించారు.
కేటాయింపు ఇలా..
మెదక్ మున్సిపాలిటి పరిధిలో రెడ్డి, మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్టీ భవన నిర్మాణాలకు రూ. కోటి చొప్పున కేటాయించారు. హజ్ భవన్, షాదీ ఖానా సెకండ్ ఫ్లోర్‌కు రూ.2.50 కోట్లు, సీఎస్ఐ చర్చి కంపౌండ్‌లో కన్వెన్షన్ హాల్, గెస్ట్ హౌజ్ కు రూ.2 కోట్లు, కుర్మ సంఘ భవన్ కు రూ.75 లక్షలు, యాదవ్ భవన్‌కు రూ.75 లక్షలు, పద్మశాలి భవన్‌కు రూ.50 లక్షలు, రజక భవన్ కు రూ.50 లక్షలు, స్వర్ణకార భవన్ కు రూ.50 లక్షలు, యాదవ భవన్ కు రూ.10 లక్షలు, విశ్వకర్మ కమ్యూనిటి హాల్‌కు రూ.10 లక్షలు, కుమ్మరి కమ్యూనిటి హాల్‌కు రూ.10 లక్షలు, ఎస్సీ కమ్యూనిటి హాల్ అదనపు ఫ్లోర్, కిచెన్, కంపౌండ్ వాల్‌కు రూ.30 లక్షలు, మున్నూరు కాపు కమ్యూనిటి హాల్ కు రూ.20 లక్షలు, ముదిరాజ్ కమ్యూనిటి హాల్‌కు రూ.20 లక్షలు, రజక సంఘం కమ్యునిటి హాల్‌కు రూ.20 లక్షలు, మహిళా కమ్యూనిటి హాల్‌కు రూ.15 లక్షలు, గంగ పుత్ర సంఘం కమ్యునిటి హాల్‌కు రూ.10 లక్షలు, క్రిస్టియన్ భవన్ కు రూ.50 లక్షలు, ఎరుకల భవన్‌కు రూ.50 లక్షలు, ముదిరాజ్ భవన్ కు రూ.20 లక్షలు, కిరాణ వర్తక సంఘ భవనానికి రూ.25 లక్షలు, వడ్డెర సంఘ భవనానికి రూ.25 లక్షలు, ఆర్య క్షత్రియ భవన్ కు రూ.20 లక్షలు కేటాయించారు. .
రామాయంపేటలో...
రామాయంపేట పట్టణంలో ముస్లిం గ్రేవ్ యార్డు కు రెండెకరాలు, మంగలి, వడ్ల, ప్లంబర్, తాపీ మేస్త్రి, ఫోర్ వీలర్ ఆటో యూనియన్, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ లకు రెండు గుంటల చొప్పున కేటాయించారు. అలాగే ఆయా కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున, ఎస్సీలకు రూ.2 లక్షల చొప్పున రూ.3 కోట్లు మంజూరు చేశారు.
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ భవనాలకు..
ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ భవనాలకు కూడా భారీగా నిధులు కేటాయించారు. మెదక్ పట్టణంలో పీఆర్టీయూ భవన్ కు రూ.25 లక్షలు, ఎస్టీయూ భవన్ కు రూ.25 లక్షలు, టీపీయూఎస్ భవన్ కు రూ.25 లక్షలు, టీపీటీఎఫ్ భవన్ కు రూ.25 లక్షలు, గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ భవన్ కు రూ.25 లక్షలు, టీఎన్జీఓ భవన్‌కు రూ.50 లక్షలు, పీఈటీ భవన్ కు రూ.25 లక్షలు కేటాయించారు.