ఖానాపూర్​లో బీఆర్ఎస్ అభ్యర్థి మెడకు కుల వివాదం

  • ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి మెడకు కుల వివాదం...
  • ఫిర్యాదులకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే రేఖ

నిర్మల్, వెలుగు:  నిర్మల్​ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను కుల వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు కావడంతో అన్ని పార్టీలు లంబాడా తెగకు చెందిన అభ్యర్థులకే టికెట్లు ఇస్తుంటాయి. పలు సందర్భాల్లో పోటీలో ఉన్న లంబాడా అభ్యర్థులకు సంబంధించి వారి కులాలపై వివాదాలు తలెత్తాయి. ఈ అంశం మీద కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

జాన్సన్ పై ఎమ్మెల్యే ఆరోపణలు

 ఈసారి అధికార బీఆర్ఎస్ నుంచి టికె ట్ పొందిన జాన్సన్ నాయక్ పై కూడా ఇలాంటి దుమారమే మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడ తెగకు చెందిన వ్యక్తి కాదని, ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవులని సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్  ఆరోపింస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్టును ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కాకుండా కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్సన్ కు టికెట్  ఇచ్చిన నాటి నుంచే ఆయనను లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

జాన్సన్ నాయక్ పేరులోనే క్రైస్తవ మతం ఉందంటూ ఆమె ఆరోపణలు చేశారు.జాన్సన్  నామినేషన్ దాఖలు చేయగానే   ఎన్నికల సంఘానికి,  ఉన్నతాధికారులకు ఆయన కులంపై ఫిర్యాదులు చేస్తానంటూ ఎమ్మెల్యే  ప్రకటిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది.  మూడు రోజుల నుంచి నియోజకవర్గంలోనే  ఉంటూ  తన అభిమానులు, సన్నిహితులతో రేఖా నాయక్ మంతనాలు సాగిస్తున్నారు.  

2009 లోను ఇదే తీరు...

2009 అసెంబ్లీ ఎన్నికల్లోను  ఖానాపూర్ సెగ్మెంట్లో  అప్పటి టీడీపీ అభ్యర్థి  సుమన్ రాథోడ్ కులం విషయం రాజకీయ దుమారానికి కారణమైంది. సుమన్ రాథోడ్ గెలవగా ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హరి నాయక్ కులం విషయంలో  ఎన్నికల సంఘానికి, కోర్టుకు ఫిర్యాదులు చేశాడు. సుమన్ రాథోడ్  మహారాష్ట్రలోని  కన్వర్ట్ కు చెందిన వారని, అక్కడ లంబాడ  తెగ ఓబీసీ పరిధిలో  ఉంటారని    ఫిర్యాదులో  పేర్కొన్నారు.  

ఆమె తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో ఆమె  ఓబీసీ పరిధిలోకి వస్తుందని, ఎస్టీ కులం ఆమెకు వర్తించదంటూ  హరినాయక్ వాదించారు. ఈ  విషయంలో  హైకోర్టు సైతం సుమన్ రాథోడ్ కు వ్యతిరేకంగా  తీర్పునిచ్చింది. అనంతరం సుమన్ రాథోడ్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.  కులం వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. 

ఆ తర్వాత సిట్టింగ్ఎమ్మెల్యే రేఖా నాయక్ కులం విషయంలో కూడా కొంత చర్చ జరిగింది. రేఖా నాయక్ కర్ణాటకకు చెందిన వారని అక్కడ ఆమె కులం కూడా ఓబీసీ పరిధిలోకి వ స్తుందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఆ ఆరోపణలను  ఆమె  తిప్పి కొట్టారు. తాను  ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  చెందినట్లుగా స్పష్టం  చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్  నుంచి అభ్యర్థిత్వం పొందిన జాన్సన్ నాయక్ విషయంలో మాత్రం రేఖ నాయక్ స్పష్టంగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులకు సిద్ధమవుతుండడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. 

పోటీ ఖాయం..

బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ కేటాయించనప్పటికీ తాను మాత్రం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసేది మాత్రం కొద్ది రోజుల్లోనే  చెబుతానంటూ  ఆమె  పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఆమె భర్త శ్యాం నాయక్ మాత్రం ఆసిఫాబాద్ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. రేఖా నాయక్ కూడా ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఈ అంశంపై  స్ప ష్టతనివ్వకుండా దాటవేస్తున్నారు. జాన్సన్ నాయక్ మీ లక్ష్యంగా చేసుకొని ఆమె పోటీలో ఉండబోతున్నారంటున్నారు.