సిరిసిల్ల నియోజకవర్గంలో కుల రాజకీయాలు

  •     ఎన్నికలు సమీపిస్తుండడంతో రూ.కోట్లు కుమ్మరిస్తున్న కేటీఆర్​
  •      సిరిసిల్లకు నెలలో నాలుగైదు పర్యటనలు 
  •     నియోజకవర్గంలో స్పీడందుకున్న పెండింగ్ ​పనులు 
  •     తాజాగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల నియామాకం


రాజన్నసిరిసిల్ల, వెలుగు :  ఎన్నికలు సమీపిస్తుండడంతో సిరిసిల్లలో క్యాస్ట్​ పాలిటిక్స్ స్టార్ట్​అయ్యాయి. ఈ నెల 15న జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని కేటీఆర్​ ప్రారంభించారు. వ్యూహంలో భాగంగా సారంపల్లి నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్​ చేయడం తనకు సెంటిమెంట్​అని మంత్రి ప్రకటించారు. కాగా ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రి కేటీఆర్​ కొంతకాలంగా సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు.

రాష్ట్రంలో ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఆరునెలలుగా తరుచూ నియోజకవర్గ పర్యటనలు చేస్తూ రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. కులాలను ప్రసన్నం చేసుకునేందుకు కుల సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఫండ్స్​మంజూరు చేస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీలకు సంఘ భవనాలు, కొన్నిచోట్ల ఫంక్షన్​హాళ్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ గ్రామాల్లో 500 కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. 

అడిగిన వెంటనే శాంక్షన్లు 

రెండు రోజుల కింద కేటీఆర్ సిరిసిల్లలో సర్ధార్​సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ తమ సంఘానికి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని అడిగారు. వెంటనే కేటీఆర్  రెండెకరాల స్థలం, నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే   జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఉన్న దాదాపు 30 ఎకరాల్లో రెడ్డి సంఘానికి 4, పద్మశాలీలకు 5 ఎకరాలు కేటాయించారు.  

ఎస్టీలు, యాదవులు, ముదిరాజ్ లు, మున్నూరుకాపు  సంఘాలకు స్థలం కేటాయించేందుకు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  అడిగిన ప్రతి కులానికి కాదనకుండా జిల్లా కేంద్రంలో సంఘ భవనాలు నిర్మించుకునేందుకు స్థలంతోపాటు ఫండ్స్​కూడా మంజూరు చేస్తున్నారు.  నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 500 కమ్యూనిటీ భవనాలు శాంక్షన్​చేయగా.. వీటిలో 90 శాతం పూర్తయ్యాయి. వీటిని ఇటీవల మంత్రి ప్రారంభించారు. 

ఏఎంసీలకు చైర్మన్ల నియామకం 

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఏడాదిగా చైర్మన్లు లేరు. ఎంతోకాలంగా ఆశావహులు చైర్మన్​గిరి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడడంతో చైర్మన్లను 
ప్రకటించారు. ఎల్లారెడ్డిపేట చైర్మన్ గా ఎలుసాని మోహన్ కుమార్, గంభీరావుపేటకు కొత్తింటి హన్మంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సిరిసిల్లకు పూసపెల్లి సరస్వతి, ముస్తాబాద్‌‌‌‌‌‌‌‌కు అక్కరాజు శ్రీనివాస్, వీర్నపల్లికి గుజ్జుల రాజిరెడ్డిను నియమించారు. 

గ్రామాల్లో పర్యటనలు 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేటీఆర్ జిల్లా పర్యటనలకు తరుచూగా వస్తున్నారు. గతంలో పోలిస్తే  నెలలో కనీసం నాలుగైదు సార్లు జిల్లాకు వస్తున్నారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చినప్పుడల్లా అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను కలుస్తున్నారు. గత నెలలో కేటీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు 12 గ్రామాలను చుట్టివచ్చారు. రోజంతా ఉరుకులు, పరుగులతో ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, తండాల్లోనూ పర్యటనలు సాగుతున్నాయి. పెండింగ్​పనులు పూర్తిచేస్తున్నారు.